*సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం*_l

*అందరూ భాగస్వాములు కావాలని వీఎస్‌యూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు విజ్ఞప్తి 31న నెల్లూరులో, నవంబర్ 7న కావలిలో ఐక్యతా పాదయాత్రలు*

 

నెల్లూరు:

భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘మేర యువ భారత్’ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, జాతీయ ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఐక్యతా సూత్రాలను పాటించడం ద్వారా నేటి యువత దేశాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. వీఎస్‌యూ తరఫున అన్ని అనుబంధ కళాశాలల్లో పటేల్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 31వ తేదీ నెల్లూరు నగరంలో, అలాగే నవంబర్ 7వ తేదీ కావలిలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, “ఈ నెల 31వ తేదీ (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఉదయం నెల్లూరు వి.ఆర్.సి. సెంటర్ వద్ద నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించనున్నాము. ఈ పాదయాత్రలో విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పాల్గొని ఐక్యతా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు.

వీఎస్‌యూ రిజిస్ట్రార్ డాక్టర్ సునీత మాట్లాడుతూ, “పటేల్ గారి త్యాగాలు, దార్శనిక నాయకత్వం దేశ ఐక్యతకు పటిష్టమైన పునాది వేశాయి. యువత ఆయన స్ఫూర్తిని అనుసరించి ముందుకు సాగాలి” అని అన్నారు.

ఈ సమావేశంలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కో ఆర్డినేటర్ డా. అల్లం ఉదయ్ శంకర్, యన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీస్ డా. వెంకట సుబ్బారెడ్డి, కమ్యూనికేషన్ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed