సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ – సిపిఐ నారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్
నెల్లూరు, జూన్ 3:
సనాతన ధర్మంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. “మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా?” అనే ప్రశ్న ద్వారా నారాయణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వివాదంలోకి లాగడమేకాక, హిందూ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ గారు మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడానికే కాకుండా, హిందూ ధర్మాన్ని తప్పుగా చిత్రీకరించే కుట్రలో భాగమని ఆయన విమర్శించారు. “సనాతన ధర్మం అనేది వ్యక్తిగత జీవిత ఎంపికల కంటే, ధర్మం, న్యాయం, సత్యం, అహింస, శాంతి వంటి సార్వత్రిక మౌలిక విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆధ్యాత్మిక పద్ధతి” అని ఆయన పేర్కొన్నారు.
“మూడు పెళ్లిళ్లు” అనే అంశం పూర్తిగా వ్యక్తిగత విషయం అని, దానికి సనాతన ధర్మాన్ని ముడిపెట్టడం అసంబద్ధమని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఒక ప్రాచీన ధర్మాన్ని విమర్శించడం చాలా బాధాకరమని అభిప్రాయపడ్డారు.
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సమాజానికి మార్గదర్శకంగా నిలిచిన ఆధ్యాత్మిక వ్యవస్థగా చరిత్రలో నిలిచిందని గుర్తు చేశారు. మహిళల గౌరవానికి పెద్దపీట వేసే ఈ ధర్మాన్ని విమర్శించడం కేవలం రాజకీయ లాభాల కోసమేనని చిలకా ప్రవీణ్ కుమార్ గారు స్పష్టం చేశారు.