నెల్లూరు, జనవరి 2 :
- శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే వేలాది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు : నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ అనూష
నెల్లూరు జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే వేలాది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ అనూష కోరారు.
ఈనెల 10 న వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రంగనాయకులపేటలో కొలువై ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు గురించి దేవాలయ ఆవరణలో గురువారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డిఓ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) సందర్భంగా వేలాదిగా విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులకు సూచించారు. దేవాలయ ఆవరణను అందమైన విద్యుత్ దీపాలతో అలంకరించవలసిందిగా, దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిందిగాను, అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరారు. అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. దేవాలయం ఎదురు రోడ్డులో వాహనాల నియంత్రణకు, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కు తగినంత పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ఇతర సేవలకు అవకాశముంటే మహిళా పోలీసులను నియమించి, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిందిగా కోరారు. దైవదర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికర సేవలు అందించాలన్నారు. అలాగే వయోవృద్ధులు, చంటి పిల్లలు తదితరులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీనివాసులు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి, పోలీస్ సీఐ అన్వర్, స్థానిక నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )