30.08.2025
నెల్లూరు
*శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*
– కనీసం రైతుకు యూరియా కూడా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు
– ప్రచార ఆర్భాటమే తప్ప రైతు గోడు పట్టని గుడ్డి పాలన
: మండిపడ్డ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
– రాష్ట్రంలో వ్యవసాయాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కార్
– వ్యవసాయం దండగనే మనస్తత్వం చంద్రబాబుది
– వ్యవసాయ మంత్రి కమీషన్లు దండుకునే పనిలో నిమగ్నం
: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
– శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
– తన నిర్వాకం నుంచి దృష్టి మళ్ళించేందుకే హత్యాయత్నం డ్రామాలు
– ఆ వీడియోలో ఉన్న వ్యక్తులంతా కోటంరెడ్డి పెంచి పోషించిన వారే
– వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం
: హెచ్చరించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు:
కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కనీసం రైతులకు సరిపడినంత యూరియాను కూడా అందించలేని అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిత్యం విజనరీని అని చాటుకునేందుకు ప్రచార ఆర్భాటాల్లో మునిగిపోయే సీఎం చంద్రబాబుకు రైతుల కష్టాలు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇక వ్యవసాయశాఖ మంత్రి తీరు చూస్తే, అధికారులను అడ్డం పెట్టుకుని కమీషన్లు దండుకునే పనిలో తీరికలేకుండా ఉన్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే…
● కూటమి పాలనలో వ్యవసాయ రంగం అధోగతిపాలైంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకవైపు పంటలకు యూరియా దొరక్క అవస్థలు, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని దుస్థితి. ఈ దుర్భర పరిస్థితుల మధ్య గత్యంతరం లేని స్థితిలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోంది. రైతు ప్రయోజనాల గురించి ఆలోచించే స్థితిలో చంద్రబాబు లేరు. రైతులకు కనీసం యూరియా ఇవ్వలేని విజనరీ ఆయన. నిద్రలేచింది మొదలు కమీషన్లు దండుకునే పనిలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేస్తే ఆయన అధికారులను పురమాయించి కమీషన్లు వసూలు చేయాలని చూస్తున్నాడు. వైయస్సార్సీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు కొనుగోలు చేస్తే 40 శాతం సబ్సిడీని వారి ఖాతాల్లో మా ప్రభుత్వం జమ చేసింది. పారదర్శకంగా రైతుల ఖాతాల్లో సిబ్సిడీ అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు వ్యవసాయశాఖ మంత్రి మాత్రం అధికారులను కమీషన్ ఏజెంట్లుగా మార్చేశాడు. నెల్లూరులో పంట కోతకొచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు చెప్పలేదు. రూ. 19,770 లకు అమ్మాల్సిన ధాన్యం పుట్టెని దళారులు రూ.15 వేలకే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు.
● ఉల్లి రైతులను పట్టించుకోరా..?
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆర్తనాదాలు సీఎం చంద్రబాబుకి వినిపించడం లేదు. మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 25లు ఉంటే, ఏపీలో మాత్రం రైతుల నుంచి కేవలం రూ.2 నుంచి రూ.4 లకే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కల్పించే దిశగా చంద్రబాబు ఆలోచన చేయడం లేదు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండటం వల్ల రైతులు ధైర్యంగా ఉండేవారు. మా ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం కూడా చెల్లించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికైనా రైతు సమస్యలపైన సీఎం చంద్రబాబు దృష్టిసారించాలి. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించాలి. రైతుల పక్షాన వైయస్సార్సీపీ పోరాడుతుంది. పోలవరం ప్రాజెక్టును స్వార్థప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబు చేసిన పాపాలు రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు హంద్రీనీవా పనులు పూర్తి చేయలేదు.
● హత్యకు కుట్ర అంటూ కొత్త డ్రామాలు
టీడీపీ ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నాలంటూ నెల్లూరులో కొత్త తరహా రాజకీయానికి కూటమి ప్రభుత్వం తెరదీసింది. మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం నెల్లూరు ఎస్పీకి అలవాటైపోయింది. కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యాప్రయత్నం, కోవూరు ఎమ్మెల్యేకి నక్సల్స్ హెచ్చరిక అని హడావుడి చేసిన నాయకులు.. కొత్తగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీద హత్యాయత్నంకు ప్లాన్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపారు. ఈ కేసులో ఎవర్ని అరెస్ట్ చేయాలో ఇంకా పోలీసులు ఖరారు చేసినట్లు లేరు. వైయస్ జగన్ గారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెడితే ఇప్పుడు ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్టుగా ఉంది. పదవుల కోసం, చంద్రబాబు దగ్గర మార్కుల కోసం దిగజారి మాట్లాడుతున్నాడు. నిద్ర లేచింది మొదలు ఎవరెవర్ని ఏయే కేసుల్లో ఇరికించాలా అని ఆలోచించే శ్రీధర్ రెడ్డి తనకేమీ తెలియదన్నట్టు మీడియా ముందు నీతులు మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఉచ్చనీచాలు మరిచిన వ్యక్తి ఎవరని చంద్రబాబు ర్యాంకులిస్తే జిల్లాలో ఫస్ట్ ప్లేస్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే ఉంటాడు. నెల్లూరులో రౌడీషీటర్ల గ్యాంగులు ఏర్పాటు చేసింది ఆయనే. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనిది ఇన్ని హత్యలు జరిగాయంటే ఆయన తీసుకొచ్చిన రౌడీ గ్యాంగ్ కల్చరే. రౌడీషీటర్ శ్రీకాంత్‌కి పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయి దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయి, ఇలాంటి డ్రామాలాడుతున్నాడు. రౌడీషీటర్ పెరోల్ కోసం లెటర్ ఇచ్చానని ఆయనే అంగీకరించాడు. ఎవరు ప్రలోభ పెడితే హోంమంత్రి అనిత సంతకం పెట్టారో కూడా చెప్పాలి. పెరోల్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్‌రెడ్డి వాటికి సమాధానం ఇచ్చుకోలేక తన మీద హత్యాప్రయత్నం జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపాడు. నిజానికి నిన్న బయటకొచ్చిన ఆ వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడితో అంటకాగినోళ్లే. (కోటంరెడ్డి బ్రదర్స్‌తో నిందితులు వినీత్, జగదీశ్, మహేష్ దిగిన ఫొటోలు ప్రదర్శించారు.) కానీ దీన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టాలని చూస్తే సహించేది లేదు.
● పెరోల్ వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్దమా..?
గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల మీదకెళితే వైయస్ జగన్ ఉపేక్షించలేదు. ఆయన మీద కేసు పెట్టించి కోర్టుకు పంపించారు. సాయంత్రానికి విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని వైయస్ జగన్ ఆదేశించారు. ఆదిలోనే అతడి అరాచకాలకు అడ్డుకట్ట వేశారు. నా పార్టీ నాయకులకు ఒక చట్టం, ఇతర పార్టీ వారు తప్పుచేస్తే ఒక చట్టం అన్నట్టు నాడు వైయస్ జగన్ ఆలోచించలేదు. ఆ కారణంతోనే శ్రీధర్ రెడ్డి మా పార్టీ వదిలేసి వెళ్లిపోయాడు. కానీ పెరోల్ విషయంలో విచారణ చేసి చర్యలు తీసుకునే ధైర్యం సీఎం చంద్రబాబుకి లేదు. వాస్తవాలు వెలుగు చూడాలంటే రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం, శ్రీధర్ రెడ్డి మీద హత్యాయత్యం కేసులను సీబీఐకి అప్పగించి విచారణ చేయించే దమ్ము చంద్రబాబుకి ఉందా? సీబీఐ విచారణ కోరే దమ్ము శ్రీధర్‌రెడ్డికి ఉందా?
● మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ…
స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులను తిడితే పోలీస్ అధికారుల సంఘం స్పందిస్తుందని ఆశించా. కానీ వారు మా పార్టీ వాళ్లు మాట్లాడితేనే మీడియా ముందుకొస్తున్నారు. అధికార పార్టీ నాయకులు తిట్టినా పట్టించుకోవడం లేదు. ఈ జిల్లా ఎస్పీ ఆ పోస్టుకి పనికిరాడు. తప్పు చేసిన పోలీసులను ఎవరినైనా విమర్శిస్తాం.
మేం ఛలో కావలికి పిలుపివ్వలేదు. అక్రమంగా అరెస్ట్ చేసిన మా పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి వారి ఇళ్లకు రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారితోపాటు కలిసి వెళ్లాలనుకున్నాం. కానీ టీడీపీ ఎమ్మెల్యేనే మీసాలు తిప్పి సవాల్ చేశాడు. కానీ చర్చకు ఆయన రాకుండా పోలీసులను పంపించాడు.