వ్యాపారులంతా ట్రేడ్ లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోండి
– అదనపు కమిషనర్ నందన్
నగరపాలక సంస్థ పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి ట్రేడ్ లైసెన్సులపై అవగాహన కల్పించి, తప్పనిసరిగా వారు పొందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ నందన్ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్ విభాగంతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ అందించి వాటిని ఎం.ఎస్.ఎం.ఈ సర్వేలో పొందుపరచాలని సూచించారు. కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ లను గుర్తించి, నోటీసులను జారీ చేసి ఫిబ్రవరి లోపు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెల అనంతరం అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది కావున ముందుగానే ట్రేడ్ లైసెన్సులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.
చెత్త తరలింపు వాహనాలకు సంబంధించిన సమస్యలు సంబంధిత వెహికల్ ఇంచార్జ్ డి.ఈ రఘురాం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
దోమల నివారణ చర్యల్లో భాగంగా ప్రతిరోజు జరిపే ఫాగింగ్ సాయంత్రం లోపు ముగిసేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో స్ప్రేయర్ల ద్వారా పిచికారి చేయడం, డ్రైను కాలువలలో ఆయిల్ బాల్స్ వేయడం, కాలువల్లో గంబూజియా చేప పిల్లలను వదలడం వంటి చర్యలను వేగవంతం చేయాలని అదనపు కమిషనర్ సూచించారు.
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థలాలలో వ్యర్ధాలు వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని, హెచ్చరిక బోర్డులను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
సచివాలయ స్థాయిలో పరిష్కారం కానీ స్థానిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన పరిష్కారం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క వార్డు శానిటేషన్ కార్యదర్శి తమ విధుల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, విధుల్లో అలసత్వం ప్రదర్శించకూడదని తెలియజేశారు.
పెంపుడు కుక్కల యజమానులను కలిసి నగరపాలక సంస్థ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ విభాగాల వార్డు సచివాలయ కార్యదర్శులు అందరూ సమన్వయంతో విధులు నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అదనపు కమిషనర్ సూచించారు. వార్డు సచివాలయ కార్యదర్శులు క్రమశిక్షణ పాటించి సమయపాలన విధుల పట్ల నిబద్ధత కలిగి ఉండాలని సూచించారు. సచివాలయ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయిస్తే దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని సూచించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్,శానిటేషన్ విభాగం సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.