*వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్య‌త‌*

*మొద‌టి మూడు రోజుల‌కు ఆన్ లైన్ లో ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ*
*చివ‌రి ఏడు రోజులు వైకుంఠం-2 ద్వారా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాలు
*అన్నమయ్య భవన్‌లో జరిగిన టిటిడి బోర్డు మీటింగ్‌
*పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి*

రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 8 వరకు నిర్వ‌హించ‌నున్న ప‌దిరోజుల‌ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కే ప్రాధ‌న్య‌త‌నిస్తున్న‌ట్లు టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు వెల్ల‌డించారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌న విధి విధాన‌ల‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో టీటీడీ చైర్మ‌న్ బి. ఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న, ఈఓ అనిల్ సింగాల్ తో కలిసి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.

డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు 10 రోజులకు గాను 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలను, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు ర‌ద్దు చేస్తున్నామన్నారు. ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, మొదటి మూడు రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్ లైన్ ఈ-డిప్ ద్వారానే కేటాయింపు జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి మూడు రోజులకుగాను భక్తులు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ-డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేష‌న్ కు అవ‌కాశం ఉందన్నారు. న‌వంబ‌ర్‌ 27 నుండి 1వ తేది వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్ల చొప్పున స్థానికులు First In First Out పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌ర‌కామ‌ణి కేసును నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేసి బాధ్యుల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణ‌యించింది. ఈ కేసులో ఎంత‌టి వారున్నా బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసి స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని తీర్మానం చేశారు. ఈనెల 27వ తేదిన అమ‌రావ‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమిపూజ‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొంటారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed