
*వేరు చేసిన తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులను తయారుచేసి ఇంటి పెరడు, లేదా గార్డెన్ ప్రాంతాలలో మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగించుకోవచ్చని, పొడి చెత్తను స్క్రాప్ వెండర్స్ కు మంచి ధరలో విక్రయించి రాబడి పెంచుకోగలమని వివరించిన కమిషనర్ వై ఓ నందన్*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 15 ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలను శనివారం నిర్వహించారు.
ఈ నెల ” పర్యావరణ రంగంలో వ్యాపార అవకాశాలు – స్వయం ఉపాధికి కొత్తదారులు” అన్న అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమాలలో భాగంగా స్థానిక హరనాధపురం కూడలి సమీపంలోని నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వేస్ట్ టు కంపోస్ట్ తయారీ కేంద్రం వద్ద కమిషనర్ మొక్కలు నాటిన అనంతరం ప్రజలందరి చేత “స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర” ప్రతిజ్ఞను చేయించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను విడిగా సేకరించడం ద్వారా మాత్రమే వాటిని కంపోస్ట్ చేయగలమని, చెత్త సేకరణ వాహనాలకు వ్యర్ధాలను అందించేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ నియమాన్ని పాటించాలని సూచించారు.
వేరు చేసిన తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులను తయారుచేసి ఇంటి పెరడు, లేదా గార్డెన్ ప్రాంతాలలో మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగించుకోవచ్చని, పొడి చెత్తను స్క్రాప్ వెండర్స్ కు మంచి ధరలో విక్రయించి రాబడి పెంచుకోగలమని కమిషనర్ వివరించారు.
వ్యర్ధాల నుంచి రాబడి సంపాదించుకునే ఉన్నతమైన ఆలోచనలను ప్రజలందరికీ అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
అనంతరం వేస్ట్ టు కంపోస్ట్ ప్రాంగణంలో జరుగుతున్న రీసైక్లింగ్ విధానాలను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, మలేరియా విభాగం అధికారి డాక్టర్ జిజియా, ఆదిత్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు వార్డు సచివాలయం కార్యదర్శులు మెప్మా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.