*తేదీ:05-02-2025*
*వెన్నుపోటు దారుల మాటలు అర్ధరహితం…*
*–అధికారం కోసం దొడ్డిదారి తొక్కడం సరికాదు*
*–పార్టీ మారిన కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేయాలి*
*–వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.కోట్లతో కోవూరు అభివృద్ది*
*–మీడియా సమావేశంలో మాట్లాడిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతిరావు*
వైఎస్సార్‌సీపీ గుర్తుతో ఎన్నికల్లో గెలుపొంది నేడు అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారు మాట్లాడుతున్న మాటలు అర్థరహితమని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరిచలపతిరావు అన్నారు. బుధవారం కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు మండలాల పార్టీ కన్వినర్లు, బుచ్చి నగర పంచాయితీ కౌన్సిలర్లతో కలసి నెల్లూరునగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బుచ్చినగర పంచాయితీలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో తమ పార్టీ జారీ చేసిన విప్‌ను కొంత మంది కౌన్సిలర్లు దిక్కరించారని వారందరిపైన అనార్హత వేటు వేయాలని అధికారులను కోరడం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ పార్టీ గుర్తుపై గెలుపొంది అధికార పార్టీకి మద్దతు తెలిపిన కౌన్సిలందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని అలా కాకుండా కొనసాగడం సరికాదన్నారు. ఎర్రంరెడ్డి గోవర్థన్‌రెడ్డి, బెజవాడ వంశీధర్‌రెడ్డి ఇద్దరు కూడా 2019లో టీడీపీ కోసం పనిచేసి ఆ తరువాత ఆపార్టీ ఓడిపోవడంతో అందులో తాము ఉండలేమని మీవైఎస్సార్‌సీపీలోకి చేర్చుకోండని బతిమిలాడుకుని చేరారన్నారు. పార్టీలో చేరి పదవులు పొందడంతో పాటు వారి పనులు చక్కపెట్టుకుటున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోవడంతో మరలా టీడీపీలోకి వెళ్లి వారి స్వలాభం కోసం, అధికార పార్టీ నేతల వద్ద మెప్పు పొందేందుకు తమ వైఎస్సార్‌సీపీ నేతలు కాకాణిగోవర్థన్‌రెడ్డి, నల్లపురెడ్డిప్రసన్నకుమార్‌రెడ్డిల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంశీధర్‌రెడ్డి ప్రస్తుతం తిరుగుతున్న కారు విడవలూరులోని ఎస్టీవర్గానికి చెందిన వ్యక్తికి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సదరు కారుకు ఉన్న ఎల్లో నెంబర్‌ప్లేట్‌ను తొలగించి వైట్ నెంబర్‌ప్లేట్ వేసుకుని దర్జాగా తిరుగుతున్నారని దీనిని ఆర్టీఓ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికారం కొసం దొడ్డిదారి తొక్కడం సరికాదని.. ధైర్యం ఉంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలో పాల్గొని ప్రజాభిమానంతో గెలుపొంది అప్పుడు మాట్లాడితే బాగుటుందని హితవు పలికారు. తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోవూరు ప్రసన్నకుమార్‌రెడ్డి 2012లో తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరి తిరిగి మరలా ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి అని.. మీలాగ ఒకపార్టీ గుర్తుపై గెలిచి పదవిలో కొనసాగుతూ పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో కొనసాగడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇలా వ్యవహరిస్తున్న వారు తమ నేతలు గురించి మాట్లాడే అర్హత లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎన్‌ఎంసీ డిప్యూటి మేయర్ రూపుకుమార్‌యాదవ్‌నుద్దేశించి హితవు పలికారు. తమ పార్టీ ప్రభుత్వ హయాంలో కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా కోట్లాదిరూపాయలతో చేపట్టిన అనేక అభివృద్ది పనులు కళ్లకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు విసుగెత్తిపోయారని భవిష్యత్తులో ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులకు సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఎస్టీకి ఉన్న కోవూరు ఎఎంసీ అధ్యక్ష పదవిని ప్రభుత్వం ఎస్సీకి కేటాయిస్తే దీనిని కోవూరు ఎమ్మెల్యే ఓసీకి మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్లు వేసి గెలిపించిన అట్టడుగు వర్గ ప్రజలను ఆదరించాలన్న విషయాన్ని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గుర్తించాలన్నారు. ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు మేనకూరు సీతారామిరెడ్డి, రాష్ట్ర పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, మండల కన్వినర్లు సతీష్‌రెడ్డి, షాహుల్, శేషగిరిరావు, నవీన్‌రెడ్డితో పాటు పలువురు బుచ్చి నరగ పంచాయితీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.