
*వి.ఎస్.యూ పరిశోధక విద్యార్థి అన్నవరపు వెంకటేశ్వర్లుకు డాక్టరేట్*
పరిశోధన రంగంలో వి.ఎస్.యూ విశిష్ట ప్రగతి: వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు…
విక్రమ సింహాపురి యూనివర్సిటీ (నెల్లూరు):
విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం (వి.ఎస్.యూ) కెమిస్ట్రీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి ఏ. వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ లభించింది. కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ త్రివేణి పర్యవేక్షణలో “A NOVEL ONE-POT SYNTHESIS OF BENZOFUSED FIVE AND SIX MEMBERED HETEROCYCLIC SYSTEMS” అనే అంశంపై వెంకటేశ్వర్లు సమర్పించిన పరిశోధన గ్రంథానికి (థీసిస్) యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, డాక్టరేట్ సాధించిన వెంకటేశ్వర్లును, ఆయన పరిశోధన మార్గదర్శకురాలు డాక్టర్ పి. త్రివేణిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ, విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో విశిష్టమైన ప్రగతిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు పరిశోధనల పట్ల మరింత ఆసక్తి చూపించి, నూతన ఆవిష్కరణలకు దారి తీసే విధంగా నిరంతరం శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ టి. త్రివేణి ప్రోత్సాహంతో ఈ పరిశోధన విజయవంతంగా పూర్తి కావడం అభినందనీయమన్నారు.
పరిశోధకుడు అన్నవరపు వెంకటేశ్వర్లు భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపకులపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.హెచ్. విజయ, కెమిస్ట్రీ విభాగ అధిపతి త్రివేణి, అధ్యాపకులు ఆచార్య టి. వీరారెడ్డి, డాక్టర్ వై. విజయ, పరిశోధక విద్యార్థులు వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేశారు.