విమానం అత్యవసర ల్యాండింగ్, తప్పిన ప్రమాదం
ముంబై నుంచి విశాఖపట్నంకు వెళుతున్న ఇండిగో విమానం హైదరాబాద్ అంతర్జాతీయ (శంషాబాద్) విమానాశ్రయంలో శనివారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు రావడంతో ఏటీసీ అనుమతితో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు.
అత్యవసర ల్యాండింగ్ ప్రకటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, క్షేమంగా విమానం ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ల్యాండైన తర్వాత సంబంధిత అధికారులు విమానాన్ని పరిశీలిస్తున్నారు.
కాగా, ఇటీవల కాలంలో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ కొరియాలో గత ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెజు ఎయిర్ సంస్థకు చెందిన విమానం రన్ వేపై ల్యాండ్ అవుతూ ముందుకు దూసుకెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టింది.
ఆ తర్వాత ఒక్కసారిగా పేలిపోవడంతో 181 మంది ప్రయాణికుల్లో 179 మంది మరణించారు. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మరోవైపు, అజెర్‌బైజాన్ కు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. కజకిస్థాన్‌లో ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలడంతో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం అజర్ బైజాన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.