*వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి : నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వినియోగదారులకు సంబంధించి కేసుల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ కన్స్యూమర్ డిస్పోజల్ రిడ్రెసల్ కమిషన్(SCDRC)లో గత మూడేళ్లలో వినియోగదారుల న్యాయస్థానాల్లో 2,200 కేసులు నమోదయ్యాయన్నది వాస్తవమా అని ప్రశ్నించారు. కేసుల్లో సత్వర పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలియజేయాలని కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బి.ఎల్‌ వర్మ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(SCDRC)లో 2,260 కేసులు నమోదయ్యాయన్నారు. గత మూడేళ్లలో మొత్తం 1686 కేసులు పరిష్కరించబడ్డాయని వివరించారు.

వినియోగదారుల వ్యవహారాల విభాగం వినియోగదారుల రక్షణ, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి వివరించారు. ప్రపంచీకరణ, సాంకేతికత, ఇ-కామర్స్ మార్కెట్లు మొదలైన కొత్త యుగంలో వినియోగదారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో వినియోగదారుల రక్షణ చట్టం, 1986 స్థానంలో వినియోగదారుల రక్షణ చట్టం-2019 రూపొందించబడిందన్నారు.

వినియోగదారుల కేసుల పరిష్కారంలో వేగం పెంచేందుకు CONFONET పథకం కింద, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) 10 బెంచులు, ఆంధ్రప్రదేశ్ SCDRC సహా రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ల(SCDRCలు) 35 బెంచుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు సమకూర్చామన్నారు. అలాగే వినియోగదారుల కమిషన్లలో ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *