తేది: 20-02-2025
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు—————–
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మరియు ICSSR-SRC హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు “సమర్థమైన ఉపాధి మార్గాల కోసం కొత్త మార్గాలు: గ్రామీణ వృత్తులను విస్తరించడం” (Innovative Pathways to Sustainable Livelihoods: Diversifying Rural Occupations) ముగింపు కార్యక్రమం నేడు వర్సిటీలోని సి.వి.రమన్ సెమినార్ హాల్‌లో ఘనంగా ముగిసింది. ఈ సదస్సు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం టూరిజం మేనేజ్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి విశ్వవిద్యాలయ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ డా. కె. సునీత గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, నూతన ఆవిష్కరణలతో గ్రామీణ వృత్తులను విస్తరించేందుకు ప్రతీ విద్యార్థి ఆలోచనల్లో మార్పు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
సభాధక్షులుగా వ్యవహరించిన వీ.ఎస్.యు కళాశాల, నెల్లూరు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. ఎం. హనుమా రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు విద్యార్థులకు వ్యాపార ఆలోచనలను పెంపొందించేందుకు మార్గదర్శకాలు కల్పిస్తాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పరిశోధనలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
విశిష్ట అతిథులు ఐఐటిటిఎం నోడల్ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి గారు మరియు కర్ణాటకలోని కోలార్ ప్రభుత్వ కళాశాల పర్యాటక విభాగం హెడ్ మహేశ గారు మాట్లాడుతూ గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ వ్యూహాలు అవసరమని, యువత దీన్ని ఉపాధిగా మలచుకోవాలని అన్నారు.
విశిష్ట అతిథులు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఎ. రాధమ్మ గారు మరియు డీఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి వి. నాగరాజ కుమారి గారు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు ఈ అవకాశాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు.
సదస్సు కన్వీనర్ డా. ఎం. త్యాగరాజు సదస్సు నివేదికను సమర్పించి, అందరి అతిథులకు ఘనంగా శాలువాలతో సత్కరించి, సదస్సులో పాల్గొన్న వారికి అతిధుల చేతుల మీదుగా ధృవపత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టూరిజం మేనేజ్ మెంట్ విభాగాధిపతి డా. పి. సుజాత, సెమినార్ కో కన్వీనర్లు ప్రొఫెసర్ కె.వి.ఎస్.ఎన్. జవహర్ బాబు, డా. కె. నీల మణికంఠ, ఎం. విక్రమ్ కుమార్, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.