Nellore
10.01.2025

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పై అభియోగాలు అసత్యం: విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిబద్ధతతో ఉన్న విశ్వవిద్యాలయం : వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ విజయభాస్కరరావు*

నెల్లూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) పై ఇటీవలి కాలంలో లేవనెత్తబడిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాల్లో ఫలితాలను సకాలములో అందిస్తున్నాము. ఎప్పుడైనా కొంత జాప్యం జరిగినప్పటికీ, అవి ఏ విద్యా సంస్థలోనైనా సహజమని, అవి వ్యవస్తాకృతమైన తప్పిదాలుగా చిత్రీకరించడం తగదని వారు వ్యాఖ్యానించారు.
పరీక్షల విభాగంపై విమర్శలు తగవు:
పరీక్షల విభాగం తగిన సమయానుకూలతతో పని చేస్తోందని, ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరుగలేదని ఉపకులపతి ప్రొఫెసర్ విజయభాస్కర్రావు స్పష్టం చేశారు. “పరీక్షల ఫలితాలను రెండుసార్లు విడుదల చేశారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. కొన్ని ఫలితాల్లో జరిగిన సాంకేతిక సమస్యల వల్ల చిన్న సవరణలు చేయడం జరిగింది. అవి విద్యార్థుల ఫలితాలను ప్రభావితం చేయలేదని గమనించాలి. ఇది సాంకేతిక సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశం మాత్రమే,” అని తెలిపారు.
మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు:
పరీక్షల నిర్వహణలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై ప్రత్యేక కమిటీ ద్వారా దర్యాప్తు జరుపుతున్నామని, ఎవరైనా తప్పు చేసినట్లుగా నిర్ధారణకు వస్తే, వారికి యూనివర్సిటీ రూల్స్ ప్రకారం తగిన శిక్షలు తప్పవని విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. “మాల్ ప్రాక్టీస్‌ను సహించేది లేదు. న్యాయబద్ధమైన విద్యా విధానాలను పాటించడంలో విశ్వవిద్యాలయం సంపూర్ణ నిబద్ధతతో ఉంది,” అని ఉపకులపతి పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యం:
విద్యార్థుల ఫలితాల జాప్యం, సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. వారి భవిష్యత్తు పట్ల విశ్వవిద్యాలయం అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తుంది. ప్రతి సమస్యకు సమర్థ పరిష్కారం అందించేందుకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంది,” అని వారు తెలిపారు.
ప్రతిష్ఠతో నడుస్తున్న విశ్వవిద్యాలయం:
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఎన్నో సంవత్సరాలుగా విద్యా రంగంలో విశిష్ట ప్రతిష్ఠను సంపాదించుకుంది. ఇటీవల వచ్చిన ఆరోపణలు విద్యా సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా లేవనెత్తబడినవిగా అనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. “ప్రతి విద్యా సంస్థలో కొన్ని చిన్న సమస్యలు సహజం. కానీ అవి ప్రాధాన్యం లేని అంశాలు, విద్యార్థులపై ఎటువంటి ప్రభావం చూపవు. ఆరోపణల వెనుక ఉన్న అసత్య ప్రచారాన్ని అంగీకరించలేము,” అని విశ్వవిద్యాలయం యాజమాన్యం పేర్కొంది.

సాంకేతిక సమస్యల పరిష్కారంపై దృష్టి:
పరీక్షల విభాగం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నదని అధికారులు తెలిపారు. “సాంకేతిక సమస్యలు వచ్చినపుడు తగిన సవరణలు చేయడం సహజం. విద్యార్థుల జీవితాలను రక్షించడం, వారికి న్యాయం చేయడం మా మొదటి కర్తవ్యం,” అని ఉపకులపతి అన్నారు.
నమ్మకంతో ముందుకు సాగుదాం:
విద్యార్థులు మరియు తల్లిదండ్రులు విశ్వాసంతో ఉండాలని, ఆరోపణల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోకుండా మోసపోవద్దని విశ్వవిద్యాలయం విజ్ఞప్తి చేసింది. “విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను కాపాడుతూ, విద్యార్థుల అభ్యున్నతికి ప్రతి క్షణం కృషి చేస్తుంది” అని వారు హామీ ఇచ్చారు.
విద్యార్థుల హితమే మా లక్ష్యం:
విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యమని, వారికి ఉత్తమ విద్యా అవకాశాలు కల్పించేందుకు విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని అధికారులు తేల్చి చెప్పారు. “సమస్యల పరిష్కారంలో తగిన పారదర్శకత, సమయస్ఫూర్తితో పని చేస్తూ, ప్రతి విద్యార్థికి మేలు చేయడమే మా లక్ష్యం,” అని విశ్వవిద్యాలయం ప్రకటించింది. 2024 సంవత్సరములో విశ్వవిద్యాలయం సకాలములో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ సుమారుగా 7500 డిగ్రీ మరియు 5600 పి.జి. విద్యార్థులకు ‘ప్రోవిషనల్ సర్టిఫికెట్స్ & మార్క్స్ మెమోస్’ అందజేయడం జరిగింది.
సంపూర్ణ న్యాయం, భవిష్యత్తు పై నమ్మకం:
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం న్యాయబద్ధతతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంది. ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతిఒక్కరు సహకరించాలని విశ్వవిద్యాలయ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed