తేది: 19-02-2025
విక్రమ సింహపురి యూనివర్శిటీలో జాతీయ సదస్సు ప్రారంభం
—————
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సర్ సీవీ రామన్ సెమినార్ హాల్ లో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ ఆర్సీ, హైదరాబాద్ మరియు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సంయుక్త ప్రాయోజకత్వంలో టూరిజం మేనేజ్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు “సుస్థిర జీవనోపాధుల వైపు నూతన మార్గదర్శనలు: గ్రామీణ వృత్తుల విభజనం” (Innovative Pathways to Sustainable Livelihoods: Diversifying Rural Occupations) అనే అంశంపై ఘనంగా ప్రారంభమైంది. అతిథులు జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం దాదాపు 100 సారాంశాలతో కూడిన సదస్సు సావనీర్ ను విడుదల చేశారు.
త్వరలో విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆచార్య అల్లం శ్రీనివాస రావు గారు గూగుల్ మీట్ ద్వారా వర్చువల్ విధానంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా జాతీయ సదస్సులు గ్రామీణ జీవనోపాధులను పటిష్టంగా మార్చేందుకు, శాస్త్రీయ పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థిక స్థిరత్వం, గ్రామీణ స్వయంప్రతిపత్తి కోసం నూతన సాంకేతికతలను, వ్యవసాయ పద్ధతులను, గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు.
విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డా. కె. సునీత గారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి కోసం కొత్త అవకాశాలను గుర్తించి, వాటిని అమలు చేసే దిశగా ఈ సదస్సు ఉపయుక్తంగా మారాలని అభిలషించారు.
సదస్సుకు అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీ.హెచ్. విజయ గారు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కోసం సుస్థిర మార్గాలను అన్వేషించడం ద్వారా, భవిష్యత్ తరాలకు మంచి అవకాశాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నుండి విచ్చేసి ముఖ్య ఉపన్యాసం చేసిన ప్రముఖ ఆంకాలజీ ప్రొఫెసర్ డా. డి. రఘునాథ రావు గారు గ్రామీణ ఆరోగ్యం మరియు క్యాన్సర్ నివారణ అనే అంశంపై ప్రాముఖ్యత గల వివరాలు తెలియజేశారు. క్యాన్సర్ నివారణలో అవగాహన, ఆరోగ్యశీలమైన జీవనశైలి పాటించటం ఎంతో అవసరమని, క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ కంటే నివారణే ముఖ్యమని, క్యాన్సర్ రాకుండా కాపాడే హెచ్.పి.వి వ్యాక్సిన్ల గురించి ప్రతి గ్రామంలో చర్చ జరగాలని, దానికి విశ్వవిద్యాలయం పూనుకోవాలని కోరారు.
బెంగళూరు నుండి విచ్చేసిన విశిష్ట అతిథి ఐటీ ప్రోగ్రాం మేనేజర్ డా. ఎస్. మహేష్ పవన్ గారు మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధులను అభివృద్ధి చేయడానికి కొత్త అవకాశాలు ఎలా బీజం పోసుకున్నాయో వివరించారు.
సదస్సు కన్వీనర్ డా. ఎం. త్యాగరాజు గారు టూరిజం విభాగపు అధ్యాపకులతో కలిసి అతిథులను ఘనంగా శాలువాలతో సన్మానించారు.
ఈ సదస్సులో కో-కన్వీనర్లు ప్రొఫెసర్ కె.వి.ఎస్.ఎన్. జవహర్ బాబు, డా. కె. నీల మణికంఠ, ఎం. విక్రమ్ కుమార్, ఇతర విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.