వికసిత భారత్ లక్ష్యసాధనలో భాగంగా స్వర్ణాంధ్ర రాష్ట్ర విజన్ ప్రణాళికలోని పది సూత్రాల అమలుకు అకుంఠిత దీక్షతో పని చేస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు.

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అత్యంత వైభవంగా జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వెంటరాగా జిల్లా కలెక్టర్ ఆనంద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మువ్వన్నెల రంగుల బెలూన్లను, శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు.

ఈ వేడుకలకు జెడ్పి చైర్ పర్సన్ అనం అరుణమ్మ, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళికలోని పది సూత్రాలైన పేదరిక నిర్మూలన, ఉపాధి, నిపుణులైన మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఇంధన ఆదా, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్నాలజీల లక్ష్య సాధన కు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరిస్తూ పి.యం.కిసాన్ పథకం క్రింద అర్హులైన 1,67,240 మంది రైతు కుటుంబాలకు 6 వేల రూపాయలు చొప్పున 66.75 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేసామన్నారు. అదేవిధంగా 561 రైతు సేవ కేంద్రాల ద్వారా 19,210 నాణ్యమైన వరి, వేరుశనగ, పెసర, మినుము విత్తనాలను సుమారు 6 కోట్ల 78 లక్షల రూపాయల సబ్సిడీతో 24,800 మంది రైతులకు అందించామన్నారు. నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలు నిర్వహణ ద్వారా 4,048 మంది టీసీలు, డిసీలు, పిసీలుగా ఎన్నికయ్యారన్నారు. అలాగే 424 వ్యవసాయ ఫీడర్ల ద్వారా రెండు లక్షల నాలుగు వేల మంది వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు సరఫరాకు సబ్సిడీ కింద 397.62 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,72,000 మంది విద్యార్థులకు 45 కోట్ల 40 లక్షల రూపాయలతో 8 రకాల వస్తువులను స్టూడెంట్ కిట్స్ రూపంలో సరఫరా చేశామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కింద 1,52,000 మంది విద్యార్థులకు 34 కోట్ల 54 లక్షల రూపాయల వ్యయంతో పౌష్టికాహరాన్ని అందిస్తున్నామని, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని ఈ నెల నాలుగో తేదీ నుండి అమలు చేశామన్నారు. భూముల రీ సర్వే ను తిరిగి ప్రారంభిస్తున్నామని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 35 గ్రామాలలోని 85,479 ఎకరాల 9 సెంట్లు రీ సర్వే చేస్తున్నామన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదటి వంద రోజుల్లో5150 గృహాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4000 రూపాయల చొప్పున ప్రతినెల 3,09,273 మందికి 132.15 కోట్ల రూపాయలను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా 15 వ ఫైనాన్స్ నిధులు 78.59 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీలకు జమ చేసామన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 945 పాట్ హోల్స్ ను గుర్తించి 2.12 కోట్లతో పునరుద్ధరించామని, 6.20 కోట్లతో డివైడర్ల నిర్మాణం, సుందరీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే 19 కోట్ల రూపాయలు వ్యయంతో మిషన్ పార్ట్ హోల్ ఫ్రీ వర్క్స్ కింద 770 కిలోమీటర్ల రోడ్డును పార్ట్ హోల్ ఫ్రీ చేస్తున్నామని ఇప్పటివరకు 280 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. అలాగే జల జీవన్ మిషన్ కింద 200 పనులను 57.82 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నామన్నారు.

*అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు*

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మొదటిగా పాడుదమా స్వేచ్చా గీతం, ఎగరేయుదమా జాతీయ పతాకం అంటూ కోవూరు జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థినులు దేశభక్తిని పెంపొందించేలా, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ చేసిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత జనగణమన జనయిత్రి మా భరతభూమి అంటూ జాతీయ నాయకుల వేషధారణలో శేషు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు చేసిన నృత్యం ఆహుతులకు ఉత్తేజం కలిగించింది. విద్యార్థులతో పాటు వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయిని కూడా వారితో కలసి సమానంగా నృత్యం చేయడంతో అందరి ఆనందానికి కారణమైంది. తదుపరి వందేమాతరం గీతాలాపన తో నెమ్మదిగా ప్రారంభించిన ముత్తుకూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు చివరలో హం ఇండియా వాలే అంటూ హుషారెత్తించారు. ఆ తదుపరి శాంతినికేతన్ గీతం సబర్మతి సంకేతం అంటూ ఓవెల్ స్కూల్ విద్యార్థులు, త్రివర్ణ పతాక రంగులతో కావలి ఏపీ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థినిలు జాతీయ పతాకాన్ని అద్భుతంగా ప్రదర్శించగా, చివరగా వచ్చిన గొలగమూడి బీసీ వెల్ఫేర్ విద్యార్థులు జయహో అంటూ వివిధ కళాకృతుల ఆకారాలతో అలరించారు.

*విజ్ఞానదాయకంగా ప్రభుత్వ శాఖల శకటాలు*

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఎన్ఆర్ఇజిఎ పధకాలను వివరిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి శకటం, జిల్లా నీటి యజమాన్య సంస్థ శకటం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేసిన పేద ప్రజల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను వివరిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ శకటం, పేదల గూడు కోసం లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ఎన్టీఆర్ కాలనీలను తెలిపే గృహ నిర్మాణ శాఖ శకటం,ఇంకా వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, జల వనరుల శాఖ, వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ ఐసిడిఎస్ శకటాలు అలరించాయి. ఇందులో ఐసిడిఎస్, డి ఆర్ డి ఏ, పశుసంవర్ధక శాఖల శకటాలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.

*స్టాళ్లను సందర్శించిన కలెక్టర్‌*

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణ కాంత్, జేసీ కార్తీక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యతేజ, జిల్లాస్థాయి అధికారులు పరిశీలించారు. జిల్లా పంచాయతీశాఖ, ఐసిడిఎస్‌, వ్యవసాయం, ఉద్యానవనశాఖ, మెప్మా, , వైద్యారోగ్యశాఖ, ఐ టి డి ఎ, మత్స్యశాఖ, విద్యుత్, పౌర సరఫరాలు, సహకార, రోడ్డు భవనాలశాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించేలా ఏర్పాటుచేసిన స్టాళ్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఆయశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు కలెక్టర్‌ కు వివరించారు.

*విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు పంపిణీ*

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభచూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసా పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed