*వరికి గిట్టుబాటు ధర పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అధికారులతో సమీక్ష*
– దళారుల బారి నుంచి రైతులను కాపాడండి.
– ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి.
రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం కొనేలా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఅర్ నివాసంలో ఆమె రెవెన్యూ, అగ్రికల్చర్, సివిల్ సప్లై, మరియు కో ఆపరేటివ్ శాఖలకు చెందిన అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 60 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అవుతుందని దాదాపు 1 లక్ష 80 వేల పుట్ల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి వరి కోతలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో అధికారులను అప్రమత్తం చేసేందుకే ఈ సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం పుట్టికి ధాన్యానికి 19 వేల 720 రూపాయలుగా ప్రకటించి వుందని అధికారులు చొరవ తీసుకొని అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రైతులు తొందరపడి ధాన్యం దళారులకు అమ్మ వద్దని ఖరీఫ్ మరియు రబి 2024- 25 సీజన్లు పూర్తయ్యే వరకు ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 80 కి పైగా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.