రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
– మార్కెట్‌ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర
– 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు
– గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం
– మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
– జిల్లా సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తోందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఉదయం సంగం మండలంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డితో కలిసి మంత్రి నాదెండ్ల పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలో 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. ప్రతి విషయంలోనూ రైతులకు మంచి చేసేందుకు నిజాయితీగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రైతులకి మార్కెట్‌ని బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ లో 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులు చేసి 5.87 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 7480 కోట్ల రూపాయలు జమచేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో 32కోట్ల రూపాయల రైతుల సొమ్ముని స్కామ్ చేసి దోచేశారన్నారు. గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను మోసం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మిల్లర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.361 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మిల్లర్లకు రూ. 10 కోట్లు చెల్లించామన్నారు. అలాగే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకుండా, 1674 కోట్లు బకాయి పెట్టిందని, తమ ప్రభుత్వం ఆ బకాయిలను రైతులకు చెల్లించిందని చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రవాణా, హమాలి చార్జీలు రూ. 1.40 కోట్లు రెండు రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 24 గంటల్లోపే డబ్బులు చెల్లించామని చెప్పారు. రైసుమిల్లుల యజమానులు బాధ్యతగా పనిచేయాలని, రైతుల్ని ఇబ్బంది పెడితే సహించమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మధ్యాహ్న భోజనపథకానికి వచ్చే విద్యాసంవత్సరం నుంచి సన్నబియ్యాన్ని సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తేమశాతం 17 కంటే ఎక్కువగా ఉంటే ఒక కేజీ నుంచి ఐదు కేజీల వరకు మాత్రమే ధాన్యం తీసుకోవాలని, అంతకు మించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. అనంతరం రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. పరిష్కారం చూపేలా చర్యలు చేపడ్తామన్నారు.
గత ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణణాతీతం – మంత్రి ఆనం
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరుతో మంత్రి నాదెండ్ల మనోహర్‌కు మంచి అనుబంధం వుందన్నారు. 1983లో నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఈ ప్రాంతంలో ఆనాటి ఎమ్మెల్యే ఆనం వెంకటరెడ్డి హయాంలో ఆత్మకూరులో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా వుండడం, మంత్రిగా నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకోవాలంటే మిల్లుల వద్ద తిండితిప్పలు లేకుండా రైతులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఆ ప్రభుత్వంలో పడిన కష్టాలు పడకుండా రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వం 90శాతం పూర్తి చేసిన సంగం, నెల్లూరు ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుని ప్రారంభోత్సవాలు చేసుకుందన్నారు. అయినా పూర్తిస్థాయిలో పనులుచేయలేదన్నారు. సంగం రోడ్డు కం బ్యారేజ్‌ని నిర్మించేందుకు తాను ఆర్థికమంత్రిగా 130కోట్ల రూపాయలను మంజూరు చేస్తే కేవలం సంగం బ్యారేజ్‌ను మాత్రమే పూర్తి చేసి రోడ్డును నిర్మించలేదన్నారు. ఈ రోడ్డును పూర్తి చేసి జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి వుందన్నారు. సంగంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని గతంలో రాజకీయ కేంద్రంగా వినియోగించుకున్నారని, తాము రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. బ్యారేజ్ వద్ద బ్రిడ్జిని పూర్తిచేయాలని, ఆత్మకూరులో వున్న ఐటిఐ కళాశాలను సంగంలో ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
రైతుల ప్రయోజనాలే ఎన్‌డిఎ ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ వేమిరెడ్డి
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారని, 11మిలియన్ టన్నుల ధాన్యం పండే అవకాశం వుందన్నారు. ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు జిల్లాలో వ్యవసాయ గోడౌన్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 78 సహకార సంఘాలు వున్నాయని, వీటి పరిధిలో దళారుల ప్రమేయం లేకుండా ధాన్యం విక్రయించుకునేందుకు జిల్లాలో 298 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటి ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, గిట్టుబాటు ధర దక్కుతుందని వివరించారు. రైతులు ఎక్కడా మోసోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పటిష్ట చర్యలు తీసుకుంటోందని వివరించారు. రైతుకు మంచి గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తుందన్నారు. ఎన్‌డీఏ భాగస్వామ్యంలో ఉండడం వల్ల రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వస్తున్నట్లు వివరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్, రాష్ట్ర వక్ప్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డిసివో గుర్రప్ప, ఎన్‌డిసిసి బ్యాంకు సిఇవో శ్రీనివాసరావు, సంగం పిఎసిఎస్ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, సిఇవో దస్తగిరి అహ్మద్, తహశీల్దార్ సోమ్లానాయక్, సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.