రెవెన్యూ వసూళ్లకు అత్యంత ప్రాధాన్యత కల్పించండి

– కమిషనర్ వై.ఓ నందన్

నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించేందుకు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన నిధులను పన్నుల ద్వారా సేకరించిన మొత్తాలనుంచే కేటాయించగలమని, కావున రెవెన్యూ వసూళ్లకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని వై.ఓ నందన్ రెవెన్యూ అధికారులు, వార్డ్ అడ్మిన్ కార్యదర్శులకు సూచించారు.

రెవెన్యూశాఖ వారాంతపు సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రీ సర్వే ద్వారా సేకరించిన వివరాల ద్వారా భవనాల పన్నులను అప్డేట్ చేయాలని సూచించారు. ఇప్పటికీ అసెస్మెంట్ లేని ఆస్తులను గుర్తించి పన్నులను నిర్దేశించాలని, పన్ను పరిధిలోకి వచ్చే అన్ని ఆస్తులను గుర్తించి పన్నులు విధించాలని ఆదేశించారు. అన్ని డివిజనులలో పునరుద్దరించనున్న పన్నుల వివరాలను స్టాంపులు & రిజిస్ట్రేషన్ ప్రభుత్వ విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ సచివాలయం వారీగా ఆన్లైన్ చేయాలని కమిషనర్ సూచించారు.

డబల్ ఎంట్రీలు, నాట్ ట్రేసబుల్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తులు, రోడ్ వైడనింగ్ లో పోయిన ఆస్తుల గత 5 సంవత్సరాల వివరాల నివేదికలను సచివాలయం వారీగా త్వరితగతిన అందజేయాలని కమిషనర్ కార్యదర్శులను ఆదేశించారు.

సచివాలయాల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను అడ్మిన్ కార్యదర్శుల ద్వారా పూర్తి చేయించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. నోటీసులకు కూడా స్పందించని మొండి బకాయిదారులకు చెందిన ఆస్తులకు సంభందించిన విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని నిర్దేశించారు.

రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు, విధులలో మెరుగైన పనితీరు కనబరచని వారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలలో అలసత్వం వహించిన కార్యదర్శులపై శాఖా పరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు, వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed