
*రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం అనంతరం శ్రీ నారా లోకేష్ గారితో కలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ టీడీపీ, జనసేన & బీజేపీ ఎంపీలు – ఆనందోత్సాహాల్లో కేక్ కట్ చేసి సంబరాలు*
న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, 2026:
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 (అమరావతి బిల్లు) రాజ్యసభలో విజయవంతంగా ఆమోదం పొందిన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ),జనసేన మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీలు, శ్రీ నారా లోకేష్ గారితో కలిసి సమిష్టిగా దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీలు ప్రధాన మంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమరావతిని రాష్ట్రానికి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ప్రకటించే ఈ చారిత్రాత్మక నిర్ణయం కోట్లాది తెలుగు ప్రజల ఆశయాలను నెరవేర్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన అనిశ్చితి, భావోద్వేగ బాధలకు ఈ బిల్లు ముగింపు పలికిందని వారు తెలిపారు.
అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాకుండా, వేలాది రైతుల త్యాగంతో నిర్మితమైన ప్రజల రాజధాని అని ఎంపీలు స్పష్టంగా పేర్కొన్నారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే దిశగా ఈ బిల్లుఈ ఒక నైతిక విజయంగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఎంపీలు ఆనందోత్సాహాలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అమరావతి బిల్లు ఆమోదం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ భేటీలు మరియు సంబరాలు సౌహార్ద వాతావరణంలో సాగగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పాన్ని ప్రతిబింబించాయి.
ఎంపీ బీద మస్తాన్‌రావు కార్యాలయం