*యోగాతో పరిపూర్ణ జీవనం సాధ్యం* – వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం – రాష్ట్రంలో 2 కోట్ల మంది.. జిల్లాలో 11 లక్షల మంది యోగ సాధన కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు – హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాధనకు సీఎం చంద్రబాబు కృషి – ఎంపీ వేమిరెడ్డి

*యోగాతో పరిపూర్ణ జీవనం సాధ్యం*

– వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
– రాష్ట్రంలో 2 కోట్ల మంది.. జిల్లాలో 11 లక్షల మంది యోగ సాధన కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు
– హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాధనకు సీఎం చంద్రబాబు కృషి – ఎంపీ వేమిరెడ్డి
– జిల్లాలో 7000 ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం – జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

యోగా నిత్య జీవితంలో భాగం కావాలని, యోగాతో సంపూర్ణ ఆయురారోగ్యాలు సమకూరతాయని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంద్ర కార్యక్రమాన్ని నెల్లూరు పరిధిలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అధికారులు వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు పాల్గొని యోగాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యోగా సాధనలో పాల్గొని యోగాసనాలు వేశారు.

అనంతరం పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 జూన్ 21వ తేదీన యోగ దినాన్ని ప్రారంభించారని అప్పటి నుండి నిరవధికంగా జూన్ 21 న ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ఏడాది యోగాకు రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, జిల్లాలో 11 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారన్నారు. జిల్లాలో దాదాపు 7000 వేల ప్రాంతాల్లో యోగా సాధన చేస్తుండటం గొప్ప విషయమన్నారు. యోగా వల్ల హెల్త్, వెల్త్ మరియు హ్యాపీ నెస్ ఏర్పడుతుందన్నారు. యోగ వల్ల కొన్ని శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారి పిల్లలకు యోగాసనాలు నేర్పించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో యోగ ప్రాచుర్యం పొందిందని, ఇతర దేశాలు కూడా యోగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లాలో యోగ కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. యోగ వల్ల శరీరంలోని ప్రతి అవయవాలు కదిలి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు. ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేయాలని ఆకాంక్షించారు.

జిల్లా కలెక్టర్ శ్రీ ఓ .ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో 7000 ప్రదేశాలలో సంసిద్ధులైన యోగా ట్రైన్లర్లతో ఈరోజు నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. జిల్లాలో సుమారుగా 11 లక్షల మంది నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. డివిజనల్ స్థాయిలో మరియు మండల, గ్రామ స్థాయిలో యోగా కార్యక్రమాలు నెలరోజులు పాటు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు సుమారుగా పదివేల మంది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు.

స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నెలరోజులపాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచి పోతాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ప్రాచుర్యం వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యతగా వ్యవహరించగా జిల్లా నోడల్ అధికారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఆర్. కె. యతిరాజు వ్యవహరించారు. శ్రీమతి సెలీనా, శ్రీమతి అరుణ సారధ్యంలో యోగా ఆసనాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎవెన్యూ స్కూల్ విద్యార్థినులు సహస్ర, లయ శ్రీ, జనన్యా తదితరులు నిర్వహించిన యోగ విన్యాసాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. అదేవిధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ అరుణ నిర్వహించిన ఏకపాద పద్మాసనం అలరించింది. కార్యక్రమం అనంతరం యోగా కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, ట్రైనర్లు సుకన్య, శైలజ, పద్మజ ,ప్రసూన, గాయత్రి, ప్రసన్న తదితరులను గౌరవించి మెమొంటోలు అందజేశారు.

కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్, డి ఆర్ ఓ ఉదయభాస్కర్, ఆయుష్ శాఖ అధికారి గోవిందప్ప, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి మోహన్ రావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed