మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో
తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధం
– అనుమతులు లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 4 వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు.
కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు.
ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఒక్కో బృందంలో సభ్యులుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో పదిమంది సహాయకులను నియమించామని తెలిపారు. బృందాలతో భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను గుర్తించి వరద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలను తీసుకునేందుకు సంసిద్ధం చేశామని తెలిపారు.
నగరపాలక సంస్థ మున్సిపల్ పాఠశాలల్లో 14 వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన అన్ని వసతులను కేంద్రాలలో కల్పించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ ఆలోచనల మేరకు వార్డు సచివాలయ కార్యదర్శులు అందరూ సహాయక చర్యలో పాల్గొనేందుకు సంసిద్ధంగా ఉన్నారని, సచివాలయం పరిధిలో అడ్మిన్ కార్యదర్శి నేతృత్వంలో సహాయక చర్యలు అందించనున్నారని కమిషనర్ తెలిపారు.
మంత్రి పి.నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిల ఆలోచనలతో ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన డ్రైను కాలువల పూడికతీత పనుల వలన నగరవ్యాప్తంగా వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. భారీ వర్షాలకు సైతం వరద నీరు సాఫీగా ప్రవహించేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
తుఫాను నేపథ్యంలో వరద ప్రభావానికి గురై ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ భాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు 0861- 2356777, 0861- 2316777 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందగలరని కమిషనర్ సూచించారు.
– అనుమతులు లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీలు, చిన్న లాలీపాప్ ల ఏర్పాటును పూర్తిస్థాయిలో నిషేధించి ఉన్నామని, అనుమతులు లేకుండా ఎవరైనా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.
పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సంయుక్త ఆలోచనలతో ఫ్లెక్సీ ఫ్రీ/ పోస్టర్ ఫ్రీ సిటీ నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించి పటిష్టంగా అమలు చేయనున్నామని కమిషనర్ తెలిపారు.
నగర సుందరీకరణకు అవరోధంగా డివైడర్ ల మధ్యలో అనధికారికంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరాదని, నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా ఫ్లెక్సీల ఏర్పాటుకు కార్పొరేషన్ అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ స్పష్టం చేశారు. అనుమతులు పొందిన ఫ్లెక్సీలు కూడా 48 గంటలలోపే తొలగించేయాలని సూచించారు. అదేవిధంగా అనుమతులు లేకుండా గోడలపై పోస్టర్లను అంటించడం కూడా చట్ట వ్యతిరేకమని, కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
ఫ్లెక్సీలు ప్రింట్ చేసే ప్రింటర్ నిర్వాహకులు ముందస్తుగా కార్పొరేషన్ అనుమతులను పరిశీలించిన తర్వాతే ఫ్లెక్సీలు ముద్రించే పనులను చేపట్టాలని కమిషనర్ సూచించారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.