మాంసం మార్కెట్ల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాంసం మార్కెట్లలో సూచించిన అన్ని ప్రమాణాలను పాటించాలని, ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 39 వ డివిజన్ చేపల మార్కెట్, మటన్ మార్కెట్ ప్రాంగణాలను కమిషనర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్లలో అవసరమైన మేరకు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇతర విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు, వినియోగదారులకు సౌలభ్యం కల్పించాలని సూచించారు.
మార్కెట్ వ్యాపార సమయాల్లో ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా రద్దీని దృష్టిలో ఉంచుకొని రోడ్డు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు సూచించారు. దుకాణాల ముందు బోర్డులు, సూచికలు వంటి వాటిని రోడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటు చేయకుండా దుకాణాల ప్రాంగణాల్లోనే ఉంచుకునేలా నిర్వాహకులను హెచ్చరించాలని తెలియజేశారు.
ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుంచి ట్రేడ్ లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికారికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించడంతోపాటు నాటిన గుంజలను కూడా పూర్తిగా తొలగించేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యస్.ఈ. రామ్మోహన్ రావు,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.