మత్స్యభవన్ ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి
– కమిషనర్ నందన్
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని మత్స్య భవన్ ను ఆధునీకరించేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మూడో డివిజన్ మైపాడు రోడ్డు, సింహపురి కాలనీ, ప్రశాంతి నగర్, వేణుగోపాలస్వామి నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్య భవన్ ను సందర్శించి వసతులను పరిశీలించారు. చేపల క్రయవిక్రయాలకు, వినియోగదారులకు, విక్రయదారులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా ప్రాంగణంలో అవసరమైన మేరకు ఆధునిక నిర్మాణ పనులను చేపట్టాలని ఆదేశించారు.
డివిజన్ పరిధిలో అన్ని డ్రైన్ కాలువలలో పూడికతీత పనులు ఎత్తివేత క్రమం తప్పకుండా జరిగేలా సంబంధిత శానిటేషన్ అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు నిరంతర పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. సింహపురి కాలనీలో డ్రైన్ కాలువల నిర్మాణాల కోసం అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. పర్యటనలో భాగంగా స్థానిక సింహపురి పార్కు, జాఫర్ సాహెబ్ కెనాల్ కట్ట పాఠశాలలను కమిషనర్ సందర్శించి వసతులను పరిశీలించారు.
అనంతరం స్థానిక రామలింగాపురం అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. టోకెన్ విధానం ద్వారా మాత్రమే ప్రజలకు ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.