బెదిరిస్తే భయపడే ప్రసక్తేలేదు..
–దేనికైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
–నిందలు వేసినంత మాత్రానా నిజం కాదు
–రాజకీయ నాయకుడంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలి
–రూరల్ ఎమ్మెల్యే అంటేనే దడుచుకుంటున్నారు
–మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ధ్వజమెంత్తిన
వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షలు తీసుకుని మోసం చేశానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి కొందరిచే తనపై ఆరోపణలు చేయించారని..ఇటువంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులు 37వ డివిజన్‌లోని విద్యుత్ కార్యాలయంలో షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారేనని చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వీరిని షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగాల్లో చేర్పించే సమయంలోనే వారిచే తనపై ఆరోపణలు చేయించి ఓ పత్రికలో వార్తను కూడా రాయించడం జరిగిందన్నారు. దాని ఆధారంగా అప్పటి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ అధికారులు తాను డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశానన్న విషయంపై విచారణ చేయించారన్నారు. విచారణలో చేసిన ఆరోపణలో వాస్తవం లేదని నిర్ధారించారన్నారు. అయితే ఎవరైతే తనపై ఆరోపణలు చేశారో వారిని ఆదే సమయంలో షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించుకోవడం జరిగిందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వెంటనే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎవరికైతే షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉద్యోగ అవకాశం కల్పించారో వారిని మీరు ఉద్యోగంలో కొనసాగాలంటే కార్పోరేటర్ బొబ్బలశ్రీనివాసయాద్‌వ్ మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని కేసు పెట్టాలని బెదిరించడంతో వారు ఆరోజు తనపై ఆరోపణలు చేశారన్నారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేసిన విజిలెన్స్ అధికారులకు సమాచార హక్కు చట్టం ద్వారా విచారణకు సంబంధించిన రిపోర్టు కాపీ నకలు ఇవ్వాలని అడగడంతో ఇది కాన్ఫిడెన్షియల్ అని నామమాత్రంగానే రిపోర్టు ఇచ్చారన్నారు. నేను కార్పోరేటర్‌ను నాస్థాయి చాలా చిన్నది..నేను చెబితే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదు. ఈవిషయం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కూడా తెలుసన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం తాను కార్పోరేటర్‌గా ఉన్న సమయంలో లైన్‌మెన్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరగలేదని స్పష్టం చేశారు. అలాంటిది లైన్‌మెన్ ఉద్యోగాలిప్పిస్తానని వారి దగ్గర నుంచి నేను డబ్బులు ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి లు మీలాగా అందరూ దోచుకునే ఆలోచనలతో రాజకీయాల్లోకి వస్తారనుకోవడం చాలా పొరపాటు అని తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు గురించి ప్రజలందరికి తెలుసని వారి గురించి మాట్లాడాలంటేన భయపడుతున్నారన్నారు. వారి గురించి మాట్లాడేది తానొక్కడేనని అందుకే వారి దృష్టి అంతా తనపైనే ఉందన్నారు. ఇటీవల నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో తనతోపాటు మరో కార్పోరేటర్ మొయిళ్లగౌరి ఎన్‌ఎంసీ చేసే తప్పులు గురించి మాట్లాడటం జరిగిందన్నారు. అదేరోజు రాత్రి రూరల్ ఎమ్మెల్యే తన అనుచరులతో మొయిళ్లగౌరికి చెందిన స్థలంలో గదిని కూలదోసి ధ్వంసం చేయించారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారని, అనేక మంది వ్యాపారాల్ని భగ్నం చేసి వాళ్ల కడుపుకొట్టి ఆయన కిందకు తెచ్చుకున్నారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగనటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే జరుగుతున్నాయన్నారు. నేను పుట్టకతో ధనవంతుడిని.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తులను పోగొట్టుకున్నాను. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు లెక్కకు మించి పెరిగాయన్నారు. మాగుంటలేఅవుట్‌లో సామాన్యుడు స్థలం కొనాలంటే జివితకాలంలో నెరవేరని కల. అదే ఎమ్మెల్యే కోటంరెడ్డి చిటికెలో కొనేశాడు. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉంటున్న పార్టీ కార్యాలయం తన స్నేహితుడికి చెందిన స్థలంలోనే ఉచితంగా ఏర్పాటు చేసుకున్నాడన్నారు. ఈరోజు ఆదే స్థలాన్ని సదరు యజమానిని బెదిరించి చౌకగా కొనుగోలు చేశాడని చెప్పారు. అలాగే లెక్చరర్స్ కాలనీలో ఓ డాక్టర్‌ను బెదిరించి వారి భవనాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసిన విషయం అందరికి తెలుసన్నారు. మీరు చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నుంచి అనేక మందిని మీ పార్టీలో చేర్చుకున్నారని వారంతా మీమీద ప్రేమతో లేరన్న సంగతి నీకు తెలీయదన్న విషయం గుర్తుంచుకోవాలని కోటంరెడ్డికి సూచించారు. రాజకీయనాయకుడంటే ప్రజల హృదయాలను గెలుచుకోవాలే కానీ ఇలా భయబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇక నుంచి మీరు చేసే అరాచకాలను ఎండగట్టేందకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు పెట్టించే కేసులకు, మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే తనపై అనేక కేసులు పెట్టించి ఉన్నారన్నారు. అంతేకాకుండా తనపై దాడిచేయించేందుకు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు సిద్దపడుతున్నారన్న విషయం కూడా తనకు తెలిసిందన్నారు. వాటన్నింటికి తాను సిద్దపడి ఉన్నానని..ఏది ఏమైనా తాను వైఎస్సాసీపీని వీడేది లేదని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈసమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రమౌళి, లక్ష్మినారాయణ, సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి, మురళియాదవ్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––