బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ బలోపేతానికి కలిసి పనిచేద్దాం.

– టీఏసీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి దిశానిర్దేశం

– ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించండి
– రూ.262 కోట్లతో లాభాల బాటలో సంస్థ
– అధికారులు, టీఏసీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ ను లాభదాయక సంస్థగా మారుస్తామని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, టెలికం అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రజలు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో గురువారం టెలికం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) తొలి సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన, సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ అమరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.

ముందుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ప్రతినిధులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభమైన సమావేశంలో నూతనంగా ఎన్నికైన టెలికం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సభ్యులను పరిచయం చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ సాధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కు సేవలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నెట్‌వర్క్‌ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, రూరల్‌, కందుకూరు, కోవూరు నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ ముందుంచారు. దీనికి అమరేంద్ర రెడ్డి స్పందిస్తూ.. ప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మళ్లీ ఆరు నెలల తర్వాత నిర్వహించుకునే ఈ సమావేశం నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. BSNL నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల 7 వేల మంది కస్టమర్లకు SERIVICES అందిస్తోందన్నారు. 17 సంవత్సరాల తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో oct – dec కాలానికి రూ.262 కోట్ల లాభాలు వచ్చాయని, అంతకుముందు ఏడాది ఇదే సమయంలో రూ.1569 కోట్ల నష్టం వచ్చిందన్నారు. లాభాలు సంస్థ అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.
టెలికం రంగంలో ప్రైవేట్‌ సెక్టార్‌ నుంచి నుంచి తీవ్ర పోటీ ఉన్నా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన ఉనికిని కాపాడుకుంటోందన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 301 4జి టవర్లు ఏర్పాటు చేశారని, మరిన్ని టవర్లు ఏర్పాటుకు అధికారులు కృసి చేస్తున్నారు. ఇటీవల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 4G, 5G సేవలు అందించేందుకు BSNL కృషి చేస్తోందని స్పష్టం చేశారు. టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారని, అధికారులు వాటిపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతారన్నారు. వినియోదారులకు 4G సేవలు అందిస్తూనే, 5Gపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. సంస్థ అభివృద్ధికి TAC సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, TAC సభ్యులు BSNL అందించే వివిధ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నెల్లూరు బిఎన్‌ఎన్‌ఎల్‌కు ఏడాదికి 30 కోట్ల ఆదాయం వస్తోందని, దాన్ని 50 కోట్లకు పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థకు పూర్వవైభవం తీసుకురావటానికి కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.

ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ అమరేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. టీఏసీ సమావేశం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విలువైన సూచనలు, సలహాలు అందించారని, తప్పకుండా వాటిని పాటిస్తామన్నారు. కమిటీ సభ్యులు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేలా ప్రయత్నిస్తామన్నారు. ఎంపీ సహకారంతో జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ బలోపేతానికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు.

కార్యక్రమంలో టీఏసీ సభ్యులు కటారి రమణయ్య, గుర్రం మాల్యాద్రి, ప్రసాద్‌, బ్రహ్మానందం, రమేష్‌ బాబు, ముంగర గోపాల్‌, అనూష, సురేంద్ర రెడ్డి, డిజిఎం ఎం.శ్రీనివాసరావు, ఐఎఫ్‌ఏ శ్రీనివాసరావు, ఏజీఎం పి.శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *