
బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే చర్యలు తప్పవు
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ధూమపానం చేస్తే చర్యలు తప్పవని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.
పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న తృప్తి కాంటీన్ ను కమిషనర్ మంగళవారం సందర్శించారు.
ఆ ప్రాంతంలోని ఒక టీ స్టాల్ వద్ద బహిరంగంగా ధూమపానం చేస్తున్న వ్యక్తులను గుర్తించి దుకాణం నిర్వాహకులను కమిషనర్ హెచ్చరించారు.
దుకాణంలో విక్రయిస్తున్న పొగాకు ఉత్పత్తులను జప్తు చేసుకోవాలని శానిటేషన్ విభాగం సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
నిర్వాహకుని విజ్ఞప్తి మేరకు మొదటి తప్పిదంగా భావించి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలేశారు. మరోసారి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసేలా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే దుకాణాన్ని సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.