*ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్‌* : *నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి*

దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం లోకసభలో పలు అంశాలపై ఆయన ప్రశ్నలు వేశారు. PwC సర్వే ప్రకారం దేశం ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్న విషయం వాస్తవమేనా అని ఆరా తీశారు. అయితే 2020లో 4వ స్థానం నుండి 2022లో 5వ స్థానానికి, 2023లో 9వ స్థానానికి పడిపోయిన కారణంగా ప్రభుత్వం ఈ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి, ఈ ర్యాంకును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు విధానపరంగా తీసుకుంటున్న చర్యలు, అదనపు మూలధన వ్యయం, దేశీయ డిమాండ్ ఈ విషయంలో ఎంత వరకు సహాయపడతాయో తెలియజేయాలని కోరారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. PwC 27వ వార్షిక గ్లోబల్ సర్వే ప్రకారం, భారతదేశం ప్రపంచంలో 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్నారు. అయితే, ప్రైవేట్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు, ఇతర ప్రపంచ సంస్థలు ఎప్పటికప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై తమ సొంత అంతర్గత పరిశోధనలను ప్రచురిస్తాయని, భారత ప్రభుత్వ అభిప్రాయాన్ని సూచించవని తెలియజేశారు.

భారతదేశంలో దేశ, విదేశీ పెట్టుబడులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, PM గతిశక్తి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)ని ప్రోత్సహించడం, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS), ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (PMG), ఎఫ్‌డీఐ విధానం సరళీకరణ వంటివి దేశంలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడానికి ఉపకరిస్తాయన్నారు.

ప్రభుత్వం పెట్టుబడిదారుల-స్నేహపూర్వక విధానాన్ని అమలు చేస్తోందని, కొన్ని ముఖ్యమైన రంగాలు మినహా చాలా రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించామన్నారు. దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎఫ్‌డీఐల పరిమితులను పెంచడం, నియంత్రణ అడ్డంకులను తొలగించడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు.

కేంద్ర బడ్జెట్-2025లో బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74% నుండి 100%కి పెంచామన్నారు. మూలధన వ్యయం, బలమైన దేశీయ డిమాండ్ దేశం యొక్క పెట్టుబడి ఆకర్షణను గణనీయంగా పెంచుతాయన్నారు. మౌలిక సదుపాయాలపై చేసే వ్యయం.. వ్యాపార ఖర్చులను తగ్గించి, ఉత్పాదకతను మెరుగుపరుస్తుందన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్ 2025 ప్రకారం మొత్తం మూలధన వ్యయం 2024-25లో రూ.10.18 లక్షల కోట్లు కాగా, ఇది 2023-24లో రూ.9.49 లక్షల కోట్లుగా ఉందన్నారు. పన్నుల చర్యలతో సహా దేశీయ డిమాండ్‌ను పెంచడానికి, తద్వారా దేశీయ వినియోగం, పొదుపులు మరియు పెట్టుబడులను పెంచడానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టబడ్డాయని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *