నెల్లూరు, మార్చి 9 :
*పేదల సంక్షేమం కోసం అనునిత్యం కష్టపడుతూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని పేర్కొన్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.*
ఆదివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని 27 మంది పేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను మంత్రి ఆనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు ఎటువంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమాన్ని అందిస్తుందన్నారు., గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను చెల్లిస్తూనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తుందన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నాలుగు వేలకు పెంచడం, మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘ నిధులను పంచాయతీలకు అందించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిన దశ నుండి 15వ ఆర్థిక సంఘ నిధులను నేరుగా పంచాయతీలకు పంపినటువంటి గొప్ప ప్రభుత్వం తమదన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద బడికెళ్లే ప్రతి బిడ్డకు 15వేల చొప్పున కుటుంబంలోని అందరు బిడ్డలకు అందిస్తామన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. అలాగే రైతాంగానికి అన్నదాత సుఖీభవ పేరుతో 20 వేల రూపాయలను మూడు విడతలుగా అందిస్తామన్నారు. అప్పులకుప్పగా మారిన రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెడుతూ, ఒక్కొక్క హామీని క్రమంగా నెరవేరుస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రుల సహాయ సహకారాలతో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. అలాగే త్వరలోనే రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలై రాజధాని పరిసర ప్రాంతాలు కళకళలాడే రోజులు వస్తున్నాయన్నారు. అదేవిధంగా శాసనసభకు గౌరవమివ్వని, ప్రజాతీర్పుకు తిలోదకాలిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన ప్రతిపక్షంను ప్రజలు శాశ్వతంగా బహిష్కరిస్తారన్నారు. శాసనసభకు హాజరుకాకుండా పత్రికా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూ, శాసనసభ ద్వారా సమాధానం చెప్పమని కోరడం విడ్డూరమన్నారు. ఇది ప్రజల తీర్పును అవహేళన చేయడమేనన్నారు. ఈ విధమైన వింత పోకడలను, అప్రజాస్వామ్య విధానాలను విడనాడాలని ప్రతిపక్షానికి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజవర్గ వివిధ స్థాయిల నాయకులు అనేకమంది పాల్గొన్నారు.
( జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది )