
పురిటి పిల్లల ఐసీయూ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్
నెల్లూరు: సింహపురి వైద్య సేవ సమితి రిజిస్టర్డ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయభారత్ హాస్పిటల్‌లో పురిటి పిల్లల ఐసీయూ (నవజాత శిశు ఇంటెన్సివ్ కేర్ యూనిట్) నూతనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ఐసీయూ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “సింహపురి వైద్య సేవ సమితి ట్రస్ట్ గత నాలుగు దశాబ్దాలుగా పేదలకు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తూ, నిజమైన సేవా దృక్పథాన్ని చూపుతోంది. దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయభారత్ హాస్పిటల్ యాజమాన్యం అభినందనీయమైంది. భవిష్యత్తులో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించడానికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది” అని చెప్పారు.
మద్యం విధానాలపరంగా గత ప్రభుత్వం చేసిన విఫలతలను ప్రస్తావించిన మంత్రి – “నాసిరకం మద్యం కారణంగా అనేక పేద ప్రజలు డయాలసిస్ బాధితులవగా, వారి బాధలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం గత 10 నెలలలో 18 నూతన డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించింది. ఈ రోజు వింజమూరు, పొదలకూరు కేంద్రాల ప్రారంభం జరిగినది. త్వరలోనే వెంకటగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ ప్రారంభం అవుతుంది” అని తెలిపారు.
“గత తొమ్మిది సంవత్సరాలలో కేవలం 45 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఏర్పాటు కాగా, కూటమి ప్రభుత్వం పదేళ్లలోనే 18 కేంద్రాలను ఏర్పాటు చేయడం గర్వకారణం. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా ఈ సేవలు మరింత విస్తరించాయి” అని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ బాల సుబ్బారావు, కోశాధికారి గుర్రం సుధాకర్, ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.