“పి4 సర్వే” వార్డు సభలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి
– కమిషనర్ సూర్య తేజ
రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను గుర్తించి, వారికీ ఆర్థిక ఉన్నతి కల్పించేలా ప్రణాళికలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పి4 సర్వే వార్డు సభ నిర్వహణకై ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు.
ఈ మేరకు పి4 సర్వే నిర్వహణకు నోడల్ అధికారుల నియమించుచూ ఉత్తర్వులను కమిషనర్ జారీచేశారు.
నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో మంగళవారం నిర్వహిస్తున్న పి4 సర్వే వార్డు సభల నిర్వహణ గురించి మొబైల్ వాహనాల ద్వారా డివిజన్ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలని కమిషనర్ ఆదేశించారు.
ప్రతి రెండు డివిజన్లకు ఒక నోడల్ అధికారిని నియమించి సభ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సభను విజయవంతంగా పూర్తి చేసేందుకు గాను పూర్తిస్థాయిలో పర్యవేక్షకునిగా విధులను కేటాయించామని తెలిపారు.
ఈనెల 30 వ తేదీ ఉగాది నాటి నుంచి సర్వే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. సర్వేలో భాగంగా వార్డు సచివాలయ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించాలని, ఓటీపీ ద్వారా వారి ఆధార్ ను నిర్ధారించుకోవాలని తెలియజేశారు. సర్వే ద్వారా ఆర్థిక స్థితి, గృహంలోని మౌలిక సదుపాయాలు, తదితర వివరాలను సేకరించి ఆన్లైన్ చేయించాలని కమిషనర్ సూచించారు.