పవన్ కీలక నిర్ణయం- పిఠాపురంలో మూడు రోజుల పండగ..!
ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో పాటు కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో వ్యూహం సిద్దం చేసుకుంటున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలుగా ప్లాన్ రెడీ చేశారు. దీనికి తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని కేంద్రంగా కూడా ఎంచుకున్నారు. ఈ మేరకు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజక వర్గంలో ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ నిర్వహించబోతున్నారు. ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించే వారు. వాటి విషయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంతో సై అంటే సై అనే వారు. అలాగే ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా వాడివేడిగా ఉండేవి. అయితే ప్రభుత్వంలోకి వచ్చాక పవన్ దూకుడు తగ్గిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరిగి జనసేన పార్టీ కార్యకర్తలు, తన అభిమానుల్లో జోష్ నింపేందుకు పవన్ ప్లీనరీని వాడుకునే అవకాశముంది.
ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ ముందుకు సాగుతున్నారు. అయితే భవిష్యత్తులో రాజకీయ పరిస్ధితులు ఎలా మారినా జనసేన పార్టీకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే క్షేత్రస్ధాయిలో బలపడాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే పార్టీ పటిష్టతపై పవన్ ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్క రోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్తా ప్లీనరీగా మార్చి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే పార్టీలో నేతల చేరికలు కూడా ఉంటాయని సమాచారం.