*పర్యావరణ సంరక్షణలో యువత భాగం కావాలి*
– సీఎం చంద్రబాబు గారి లక్ష్య సాధనకు నడుం బిగిద్దాం
– ఒకే రోజు కోటి మొక్కలు నాటడం గొప్ప విషయం
– ఒక మొక్క మంచి స్నేహితుడితో సమానం
– వన మహోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు కృషి చేస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పర్యావరణ సంరక్షణలో యువత భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని నగరవనంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఇన్‌ఛార్జి కలెక్టర్ కార్తిక్ గారు, డీఎఫ్‌వో మహ్మద్ బాషా గారు, ఆర్డీవో అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి గారు, నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో కలసి మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గారి పిలుపు మేరకు వన మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఐక్య రాజ్యసమితి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ఈ రోజును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1 కోటి మొక్కలు నాటడం గొప్ప విషయమని, జిల్లాలో అధికారులు 4.25 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారన్నారు. విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండులు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30.5 శాతం మేర పచ్చదనం ఉందని, ఈ పచ్చదనాన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఒక మొక్క మంచి ఫ్రెండ్‌తో సమానమని, చెట్లు నరకకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాగే నీటి దగ్గరి నుంచి పీల్చే గాలి వరకు కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్ ఛార్జి కలెక్టర్ కార్తిక్ గారు మాట్లాడుతూ.. ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ను నిరోధించటానికి అందరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించాలన్నారు. ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్ నిషేధానికి అందరూ కలిసికట్టుగా కృషిచేసి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకుగాను రెడ్యూస్, రీ యూస్, రీసైకిల్, రీప్లేస్ అనే నాలుగు విధానాలతో కృషి చేయాలన్నారు. రోజు వారీ వినియోగంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కు బదులుగా జూట్, వుడ్ తో చేసిన వస్తువులను ఉపయోగించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం కేవలం నినాదంగానే కాకుండా ప్రజలందరి జీవన విధానంలో భాగమయినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు.
అనంతరం పర్యావరణ సంరక్షణకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యార్థినులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.