నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు
– అదనపు కమిషనర్ వై.ఓ నందన్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 120 మైక్రోన్లకన్నా తక్కువ స్థాయి గల సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు అదనపు కమిషనర్ వై.ఓ నందన్ స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు, రిటైలర్లు, ఇతర విక్రయదారులతో ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతినెల మూడవ శనివారం నాడు “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా సింగల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీదారులు, రిటైలర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీని ఇకనుంచి కచ్చితంగా ఆపివేయాలని అదనపు కమిషనర్ హెచ్చరించారు.
క్రమం తప్పకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.