నెల్లూరు, మార్చి 7 :
*ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సంబంధిత రైస్ మిల్లర్ల పై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్*
శుక్రవారం కలెక్టర్ వారి ఛాంబర్ లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ను రైతు కు చెల్లించాల్సిందేనన్నారు.
అంతకంటే తక్కువకు కొనుగోలు చేస్తే ఆయా దళారులు, వ్యాపారుల పై తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. మిల్లర్లు పై కేసులు పెట్టే వరకు పరిస్థితి ని తీసుకురావద్దన్నారు.
రైతులు, వ్యాపారులు ఉభయులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నదన్నారు. జిల్లాలోని 105 రైస్ మిల్లుల వద్ద సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు.
రాబోయే నాలుగు రోజుల్లో బ్యాంక్ గ్యారెంటీలు చూపించాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. గోనె సంచులను అందుబాటులో ఉంచాలన్నారు. బ్యాంక్ గ్యారెంటీలు చూపి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించిన వారికి ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు. అంతిమంగా ఆరుగాలం శ్రమించి కష్టించే రైతులు నష్టపోకుండా చూడాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు.
ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డి ఎస్ ఒ అంకయ్య, పౌర సరఫరాల సంస్థ డియం అర్జున్ రావు, వివిధ రైస్ మిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.