దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి
– ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో ప్రధాన సమస్యగా ఉన్న దోమలను నియంత్రించి, వాటి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ సూర్య తేజ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్, ఆయిల్ బాల్స్ పిచికారి, కాలువల్లో గంబూజియ చేపల పెంపకం వంటి వాటితో పాటు ఇతర సరికొత్త పద్ధతులను అవలంబించి దోమలను నివారించాలని సూచించారు.
రూరల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రధాన రోడ్ల తో పాటు అన్ని ప్రాంతాలలో ప్యాచ్ వర్క్ లు, రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఎల్&టి, మెగా కంపెనీల ఆధ్వర్యంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా నిధులను కేటాయించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్. ఈ. రామ్ మోహన్ రావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఈ.ఈ. శేషగిరిరావు, ఎల్&టి, మెగా కంపెనీల ప్రతినిధులు, నుడా అధికారులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.