- *తెలుగు భాష అమృత భాష : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి*
– ప్రపంచ తెలుగు సమాఖ్య రెండో రోజు ఘనంగా ప్రారంభమైన కార్యక్రమాలు
– ప్రారంభోపన్యానం సమాఖ్య ఉపాధ్యక్షులు, ఎంపీ వేమిరెడ్డి
– ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
– తెలుగు సమాజ సమైక్యత కోసం సమాఖ్య నిరంతరం తపిస్తోంది – ఎంపీ
– రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగును కాపాడుకోవాలి – కిషన్ రెడ్డి
తెలుగు భాష పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు అభినందనీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గారు అన్నారు. తెలుగు భాషను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు భాష చాలా స్వచ్ఛమైన భాష అని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 2వ రోజు సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న కిషన్ రెడ్డి గారికి ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు భాష విశిష్టతను, సమాఖ్య ఏర్పాటు చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. తెలుగువారినంతా ఒక చోటకి చేర్చి వారంతా సమైక్యంగా ఉండాలన్నదే World Telugu Federation ఆశయమని అన్నారు. అందులోభాగంగా “సంఘీభావమే బలం” అనే నినాదంతో ఫెడరేషన్ పనిచేస్తోందని, తెలుగు సమాజ సమైక్యత కోసం నిరంతరం తపిస్తోందని వివరించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి గారికి, ఇతర ముఖ్యఅతిథులకి, World Telugu Federation ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. కిషన్‌రెడ్డి గారు చిన్నవయస్సులోనే రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీ అభివృద్ధి కోసం నడుంబిగించారన్నారు. గడచిన 45 సంవత్సరాల కాలంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అంకితభావంతో పనిచేసి ఈ స్థాయికి చేరారని కొనియాడారు.
తెలుగువారినందరిని ఒకే వేదికపైకి తేవడమే లక్ష్యం…
తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తేవడమే ప్రపంచ తెలుగు సమాఖ్య లక్ష్యమని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు నిర్వహించామని, మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాఖ్య ఏర్పడిన గత 30 సంవత్సరాలలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాలలో సమావేశాలు నిర్వహించామన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని కలిపేలా దుబయ్, సింగపూర్, మలేషియా ఇతర దేశాల్లో కూడా సభలు జరిపామన్నారు. తెలుగుభాష అభివృద్ధి కోసం సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్ పడుతున్న పడుతున్న తపన అభినందనీయమని కొనియాడారు. తనను ఈ ఫెడరేషన్‌లో భాగం చేసి, ఒక సమిధని చేసిన ఇందిరా దత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మ లాంటి కమ్మనైనది తెలుగు భాష అని, ఇది ఎప్పటికీ ‘మృతభాష’గా కాకుండా, ‘అమృతభాష’గా చిరకాలం వర్ధిల్లాలంటే.. మనమందరం తెలుగుభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు జాతి పేరు ప్రపంచమంతా వినపడేలా ‘తెలుగు దేశం’ పార్టీని పెట్టిన ఘనత నందమూరి తారకరామారావు గారిదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మూడురోజుల అంతర్జాతీయ మహాసభలని ప్రారంభించడం శుభకరమన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, కేంద్ర మాజీమంత్రి శ్రీమతి పురందేశ్వరి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి లాంటి ప్రముఖులంతా ఈ మహాసభలలో భాగం పంచుకోవడం అభినందనీయమన్నారు. World Telugu Federation చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని వేమిరెడ్డి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గారు మాట్లాడుతూ.. మాతెలుగు తల్లికి మల్లెపూదండ అన్న ఎంత మాధుర్యం ఉందో తెలుగు భాషలోనూ అంతే మాధుర్యం ఉందన్నారు. తెలుగు భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకునేందుకు గత 32 ఏళ్లుగా ప్రపంచ తెలుగు సమాఖ్య చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. 2వ శతాబ్ధ కాలం నుంచే తెలుగు వాడుకలో ఉందని చరిత్ర చెబుతోందన్నారు. దేశ సాహిత్యంలో తెలుగుకు ఉన్న స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో మహానుభావులు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారన్నారు. నిజాం కాలంలో నిర్భంధాల మధ్య ఉన్న తెలుగు నేడు స్వేచ్ఛావాయువులు పీల్చుతోందన్నారు. ఇంగ్లీషు మోజులో తెలుగును చిన్నచూపు చూడొద్దని, మాతృభాషలో చదువుకున్న ఎందరో దేశ సేవలో ఉన్నారన్నారు. ఇంగ్లీషుతో అభివృద్ధి రాదని, మాతృభాషతోనే జాతి ఉనికి, జాతి అభివృద్ది ఉంటుందన్నారు. మనో వికాసం మాతృభాషతోనే సాధ్యమని వివరించారు.
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి..
తెలుగు భాషను పరిరక్షించేందుకు టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి వివరించారు. డిజిటల్ రంగంలో అనేక వందలాది అంశాలను తెలుగులో అందిస్తున్న అజ్ఞాత వ్యక్తులను ఆయన అభినందించారు. డిజిటల్ యుగంలో అన్ని విషయాలను తెలుగులో అందించే సామర్థ్యం ఉందని, టెక్నాలజీని ఉపయోగించి తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో ఉన్న అనేక వస్తువుల పేర్లు తెలుగులో కనుమరుగు అవుతున్నాయని, ఇంగ్లీషు మోజులో పడి సంప్రదాయాలను మర్చిపోతున్నామన్నారు. ఇంట్లో మనం వాడే వస్తువుల పేర్లయినా తెలుగులో పలికితే ఇంట్లో ఉండే పిల్లలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. న్యాయస్థానాల్లో తెలుగు వాడకం శుభపరిణామన్నారు. తెలుగు సినిమాలు, తెలుగు రచనలు, తెలుగు యాసలు.. తెలుగును సజీవంగా ఉంచుతున్నాయని, ఈ మార్పు అన్ని చోట్లా వస్తే తెలుగు భాష ఎప్పటికీ నిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బృందాన్ని వారు సత్కరించారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న కళాకారులను వారు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందించారు.