తిరుమల, తిరుపతిల్లో మైసూరు మోడల్: టీటీడీ నిర్ణయం..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 62,085 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 15,680 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాల్లోనూ విస్తృతంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లను వేస్తోన్నారు. రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తోన్నారు.
తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలకు కర్ణాటకలోని మైసూరుకు చెందిన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రతిష్ఠాత్మక మైసూరు దసరా ఉత్సవాల తరహాలో ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల, తిరుపతిలలో విద్యుత్ అలంకరణలు చేయనున్నారు.
ఆయా ఏర్పాట్లపై తాజాగా టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటైంది. ఇందులో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఆదేశాలను జారీ చేశారు
తిరుపతి, తిరుమల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ, భక్తుల భద్రత, స్వామివారి దర్శనం, వసతి గదుల బుకింగ్, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణ, అన్నప్రసాదం, ఇతర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా విచ్చేసి భక్తుల రద్దీ కోసం వివిధ పార్కింగ్ ప్రాంతాలను కేటాయించడం ద్వారా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. ముందస్తుగా పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించిన వివరాలను విడుదల చేయాలని, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి ముఖ్యాంశాలతో రూపొందించిన సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్‌పై శ్యామలరావు చర్చించారు. దీనిపై టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈఓకు వివరించారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు వివరించారు
తిరుమలలో విద్యుత్ దీపాలంకరణలకు కర్ణాటకలోని మైసూరుకు చెందిన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రతిష్ఠాత్మక మైసూరు దసరా ఉత్సవాల తరహాలో ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల, తిరుపతిలలో విద్యుత్ అలంకరణలు చేయనున్నారు.