తిరుమలలో హోటళ్లకు కఠిన ఆదేశాలు..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 66,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 18,647 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
ప్రస్తుతం భక్తులు వైకుంఠం కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లల్లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.
మరోవంక- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. ఈ నెల 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.
ఈ 10 రోజుల్లో తిరుమలకు లక్షలాదిమంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ క్రమంలో తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర చిరుతిండ్ల దుకాణాల యజమానులతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. భక్తులకు ఆహారాన్ని అందించడంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తిరుమలలోని అన్ని హోటళ్లు, తినుబండార కేంద్రాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తినుబండారాల ఆవరణలో పరిశుభ్రత, పాటించాలని, నిబంధనలు, మార్గదర్శకాలనుపాటిస్తూ తిరుమల ఖ్యాతిని నిలబెట్టాలని సూచించారు
పెస్ట్ కంట్రోల్ మెషీన్‌లను ఉంచడం, సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవడం, పారిశుద్ధ్య విధానాలను పాటించడం వంటివి తప్పకుండా పాటించాలని వెంకయ్య చౌదరి అన్నారు.
దుకాణదారులందరికీ ఎస్‌ఓపీ జాబితాను సిద్ధం చేయాలని, చెక్‌లిస్ట్ ఇవ్వాలని, ఏవైనా కొరత ఉంటే వాటిని సరిదిద్దేందుకు కొంత సమయం ఇవ్వాలని సంబంధిత టీటీడీ అధికారులను ఆదేశించారు. ఇక నుంచి కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేస్థామని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారని ఆయన చెప్పారు.