తిరుపతి తరహా ఘటనలు జరగకుండా ప్రణాళికతో చర్యలు

– సీఎం చంద్రబాబు సత్వర చర్యలు చేపట్టారు

– బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలిచారు

– సీఎం ఆదేశాలతో క్షతగాత్రులందరికీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేయించాం

– ఘటనకు కారకులుగా భావించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం,

– తిరుపతి ఘటన విచారణకు మంత్రివర్గ ఉపసంఘం

– విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు

– హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం…

– దేవాదాయశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం

*పాత్రికేయుల సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి*

నెల్లూరు,( కలెక్టరేట్ ) మేజర్ న్యూస్

భవిష్యత్‌లో తిరుపతి తరహా ఘటనలు జరగకుండా టిటిడి, దేవదాయశాఖ, జిల్లా యంత్రాంగం ఉమ్మడి ప్రణాళికతో పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిలో ముక్కోటి ద్వార దర్శన ఏర్పాట్లలో భాగంగా టోకెన్ల కేటాయింపు క్యూలైన్‌ వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు దుర్మరణం చెందడం దేశ ప్రధాని మొదలు అందరిని కలచివేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి ఓదార్చి ఆ కుటుంబాలకు అండగా నిలిచినట్లు చెప్పారు. ముక్కోటి ద్వారదర్శన క్రమంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు అండగా నిలిచేందుకు తనను, హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను ప్రత్యేకంగా పంపి పరిస్థితులు చక్కదిద్దామని ఆదేశించారన్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం కారణాలను ఆరాతీసి బాధ్యులైన ఒక ఐఎఎస్‌, ఐపిఎస్‌ స్థాయి అధికారులను బదిలీ చేయగా, డిఎస్పీ, టీటీడీ డైరెక్టర్‌ స్థాయి అధికారిని సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. బాధితులను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పరామర్శించి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పామని, క్షతగాత్రులను పరిశీలించి వారు సత్వరం కోలుకునేలా మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించినట్లు చెప్పారు. తొక్కిసలాటలో 35మంది గాయపడగా, సుమారు ఒకటిన్నర గంట పాటు సీఎం చంద్రబాబు క్షతగాత్రులను పరిశీలించి వారి ఆరోగ్యపరిస్థితి, యోగక్షేమాలు తెలుసుకుని పరామర్శించినట్లు చెప్పారు. దుర్మరణం చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు, తీవ్రగాయాలైన వారికి 5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి 2 లక్షల చొప్పున ప్రభుత్వ సాయంగా అందించినట్లు చెప్పారు. ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి వారి స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. వీరిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారు కాగా ఒకర కేరళ, మరొకరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా మంత్రి చెప్పారు. తిరుపతి విష్ణునివాసం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్‌ వద్ద షుగర్‌ లెవల్స్‌ తగ్గి ఓ మహిళ కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను బయటకు తీసుకువెళ్లే క్రమంలో టోకెన్లు ఇస్తున్నారని భావించిన భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ మహిళను బయటకు తీసుకెళ్లే క్రమంలో ఒకవైపు తెరవాల్సిన గేటు..మరోవైపుకు తెరవడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో 90 కౌంటర్లు ద్వారదర్శన టోకెన్ల కేటాయింపు కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

*తిరుపతి ఘటనపై సంపూర్ణ విచారణకు ఉపసంఘం : మంత్రి ఆనం*
ఘటనపై సంపూర్ణ విచారణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమిస్తూ ఆదేశాలిచ్చారని చెప్పారు. విచారణ పూర్తయిన వెంటనే ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం, టీటీడీతో సమీక్షలు నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తామని మంత్రి చెప్పారు.

*ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షతగాత్రులకు వైకుంఠ ద్వారదర్శనం : మంత్రి ఆనం*
తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు మంత్రి చెప్పారు. క్షతగాత్రులందరూ తమకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని సీఎంను కోరగా, స్పందించిన సీఎం క్షతగాత్రులందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తర ద్వార దర్శనం చేయించినట్లు చెప్పారు. మొత్తం 52 మందికి దర్శనం చేయించినట్లు చెప్పారు. తమకు మెరుగైన వైద్యం అందించి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం చంద్రబాబుకు బాధితులు కృతజ్ఞతలు తెలిపి తమ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి చెప్పారు.

*హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం…దేవాదాయశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం : మంత్రి ఆనం*
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్న మంత్రి, దేవాదాయశాఖలో అనేక హామీలు నెరవేర్చినట్లు చెప్పారు. ప్రధానంగా గతంలో ధూపదీప నైవేద్యాలకు రూ.5వేలు ఇస్తుండగా 5400 ఆలయాల్లో ఒక్కొక్క ఆలయానికి ప్రస్తుతం రూ.10వేలు ఇస్తున్నామని, అర్చకులకు గతంలో రూ.10వేలు వేతనం ఇస్తుండగా తమ ప్రభుత్వం రూ.15వేలు ఇస్తుందని, వేద విద్యార్థులకు రూ.3వేలు సంభావన అందించి వేదవిద్యను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆలయాల్లో ఖాళీగా వేదపండితుల పోస్టులను వేదం చదువుకున్న విద్యార్థులతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 1492 ఆలయాలకు త్వరలోనే పాలక మండళ్లును నియమిస్తామని, ఇందులో ఒక నాయీ బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. వేదాలు, ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, భక్తులకు భగవదానుగ్రహం కల్పించేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని మంత్రి చెప్పారు.
……………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *