తాగు నీటి పన్నుల బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి
– కమిషనర్ సూర్య తేజ
నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని కమిషనర్ సూర్య తేజ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, హౌసింగ్ విభాగం అధికారులు, సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నీటి పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో తాగునీటి కుళాయి కనెక్షన్ తొలగిస్తామనీ తెలియజేయాలన్నారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
తాగు నీటి పన్ను వసూళ్ళలో సచివాలయ కార్యదర్శుల ప్రతీ వారం 10% బకాయీలు వసూలు అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వీధి దీపాలను సోమవారం నాటికి అమర్చండి…
నగర వ్యాప్తంగా విద్యుత్ వీధి దీపాలను సోమవారం నాటికి అమర్చేలా చర్యలు తీసుకుని పనులు పూర్తయ్యేంత వరకు పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు. 30 మంది సిబ్బందిని ప్రత్యేకంగా వీధి దీపాలు అమర్చేందుకు నియమించుకుని వారంలోపు నగర వ్యాప్తంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ ఎస్.ఈ. విజయన్ కు కమిషనర్ సూచించారు. సెంట్రల్ లైటింగ్ విధానాన్ని నగరంలో 5 కూడళ్ళలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ సహకారంతో వీధి దీపాల ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
“సూర్య ఘర్ బిజిలి యోజన” పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజలందరూ అవగాహన పెంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు.
కేంద్ర,రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని, సామాన్య ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించుకోడానికి సోలార్ సూర్యఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఒక కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని అందులో 30% సబ్సిడీ లభిస్తుందని వివరించారు. మిగిలిన మొత్తంలో 90 శాతానికి బ్యాంకు ఋణ సదుపాయము ఇస్తుందని తెలియజేశారు.
రాబోతున్న వేసవిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ఇవ్వడానికి ఈ సోలార్ విద్యుత్ ఎంతో అవసరమని తెలియజేశారు. సోలార్ పలకలు ఇంటి పై ఏర్పాటు చేసుకున్నందు వల్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇళ్లు కూడా చల్లగా ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం బయట మార్కెట్లో యూనిట్ ధర ఎక్కువ రేటుతో కొని వినియోగదారులకు ఇస్తున్నామని, అదే సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకుంటే ఇంటికి సరిపడా విద్యుత్ ను వాడుకుని మిగిలింది గ్రిడ్ కు పంపించవచ్చని తెలిపారు.
నెల్లూరు నగరంలో 7 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించి 140 కోట్ల రూపాయలతో ప్రభుత్వం వారి ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ పలకలను బిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కమిషనర్ వివరించారు.
25 సంవత్సరాల గ్యారంటీతో ఈ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఐదు సంవత్సరాలలో మీరు పెట్టే పెట్టుబడి మీకు పూర్తిగా వస్తుందని మిగిలిన 20 సంవత్సరాలు విద్యుత్తును ఉచితంగా వాడుకోవచ్చు అని తెలిపారు.
కమర్షియల్ భవనాలకు రాయితీ లభ్యపడదని, సచివాలయాల పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సదస్సులను నిర్వహించి డిజిటల్ అసిస్టెంట్ కార్యదర్శి ఆధ్వర్యంలో లబ్దిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు.
టిడ్కో గృహలకు లబ్దిదారులను తరలించేలా చర్యలు చేపట్టండి
నగర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహలలో ఇప్పటి వరకు 17,520 గృహాలు నిర్మాణాలు పూర్తయి లబ్దిదారులకు అందుబాటులో ఉన్నాయని, అందులో 7636 గృహలను ప్రజలు స్వాదీనం చేసుకుని నివాసం ఉంటున్నారని కమిషనర్ తెలిపారు. ఇంకా 9792 గృహలలో కుటుంబాలు చేరలేదని, వారందరికీ అవగాహన కల్పించి గృహలలో చేరేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కమిషనర్ అమెనిటీస్ కార్యదర్శులను ఆదేశించారు. గృహ సముదాయాల ప్రాంగణలలో అన్ని మౌళిక వసతులను కల్పించి అన్ని రకాలుగా నివాస యోగ్యంగా అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. గృహలకు సంభందించిన విద్యుత్ వైరింగ్ పనులను, త్రాగునీరు లను టిడ్కో సిబ్బంది మరో పదిరోజుల్లో పూర్తి చేయనున్నారని తెలిపారు.
పి.ఎమ్.ఎ.వై. 2.0 పధకంలో భాగంగా స్వంత ఇంటి స్థలంలో నిర్మాణాలు జరుపుకునేందుకు లబ్ధిదారులకు అప్లికేషన్లు ఆన్లైన్ నందు నమోదుచేసి సంబంధిత పత్రాలను హౌసింగ్ అధికారులకు అందచెయ్యవలసినదిగా కమిషనర్ అదేసించారు.
ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ విజయన్, టిడ్కో ఎస్.ఈ మహేష్, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, నగరపాలక, టిడ్కో,హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.