తాగునీటి కుళాయి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి
– అదనపు కమిషనర్ నందన్
నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాలను సాధించాలని అదనపు కమిషనర్ నందన్ సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులను ఆదేశించారు.
నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టిడ్కో విభాగం, హౌసింగ్ విభాగం, సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ విభాగంలో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్లకు ప్రతిరోజు ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. పన్ను బకాయిలు ఉన్న ప్రతి ఒక్క ఆస్తి యజమానికి నోటీసులు జారీ చేసి నిర్దేశించిన సమయంలోపు చెల్లించని పక్షంలో తాగునీటి కుళాయి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరికలు తెలియజేయాలన్నారు. అందుబాటులో లేని భవన యజమానులను ఫోన్ ద్వారా సంప్రదించి ఆన్లైన్ పేమెంట్ చేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెల 31వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కేవలం 48 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు. సచివాలయాల వారీగా సంబంధిత డీ.ఈ.ఈ. లు ఏ.ఈ.లు పన్ను వసూళ్ల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొని మొండి బకాయిలు వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సచివాలయాల వారీగా నిర్దేశించిన వారాంతపు లక్ష్యాలలో కనీసం 25 శాతం తగ్గకుండా వసూలు చేయాలని సూచించారు. ఇంటింటి సర్వేలో భాగంగా గుర్తించిన డబల్ ఎంట్రీలు, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించబడిన కుళాయిలు తదితర వాటి పూర్తి నివేదికను కౌన్సిల్ వారికి నివేదించిన పిదప కౌన్సిల్ వారి అనుమతితో సి.డి.ఎం.ఏ. వారికి నివేదికలు పంపిన పిదప తదుపరి చర్యలు చేపట్టుట కొరకు సచివాలయాల వారీగా లిస్టును అందజేయాలని అదనపు కమిషనర్ సూచించారు.
తాగునీటి కుళాయి పన్నుల వసూళ్లలో వార్డు సచివాలయ అడ్మిన్, కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ అమెనిటీస్ కార్యదర్శులు వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కమిషనర్ సూచించారు. మొండి బకాయిదారులను గుర్తించి అమలులో వున్న మున్సిపల్ చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గృహాలలో స్టేజ్ కన్వర్షన్, ఆప్షన్ 1 & 2 ప్రక్రియలు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు. వారంలో కచ్చితంగా ఒక స్టేజ్ కన్వర్షన్, ఒక గృహ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
టిడ్కో గృహాలలో లబ్ధిదారులను సచివాలయాల వారీగా చేర్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని, గృహ సముదాయాల ప్రాంగణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని లబ్ధిదారుల్లో అవగాహన పెంచాలని అదనపు కమిషనర్ అమెనిటీ కార్యదర్శులకు సూచించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ.శ్రీనివాసరావు, డి.ఈ.ఈ. సుధేష్ణ, రఘురాం,ముజాహిద్దీన్,ప్రసాద్ ఏ.ఈ.లు రమణారెడ్డి,అంజి రెడ్డి, హౌసింగ్,వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.