డ్రైను కాలువల్లో క్రమంతప్పకుండా పూడికతీత పనులను చేపట్టండి
– కమిషనర్ సూర్యతేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, పూడికతీత అనంతరం రోడ్లపై సిల్ట్ వ్యర్ధాలు లేకుండా వెంటనే తొలగించాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు.
పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ.ఎం. సూర్య తేజ గారు 13వ డివిజన్ గౌడ హాస్టల్ సెంటర్, బాలాజీ నగర్, దర్గా వీధి, బ్యాంకు కాలనీ, రెయిన్బో నగర్, గ్యాస్ గోడౌన్ సెంటర్ ప్రాంతాలలో పర్యటించారు.
పర్యవేక్షణలో భాగంగా విధులలో నిర్లక్ష్యం వహించిన 13వ వార్డు సచివాలయమునకు సంబంధించిన శానిటేషన్ కార్యదర్శి వెంకటరత్నం, ప్లానింగ్ సెక్రటరీలు మనోజ్, రఘు, ఎమినిటీస్ సెక్రటరీ పవన్ నలుగురికి మెమోలు ఇవ్వవలసినదిగా అధికారులను ఆదేశించారు.
పర్యవేక్షణలో మేజర్ కాలువల పూడికతీత సిల్ట్ తొలగింపు చర్యలను చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మెయిన్ రోడ్లలో భవన నిర్మాణాల వ్యర్ధాలు, రోడ్డుమీద ఉపయోగంలో లేని కరెంటు స్తంభాలు, రోడ్డు మధ్యలో వేలాడుతున్న వైర్లను గుర్తించి సంబంధిత కార్యదర్శులపై కమిషనరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నివాసము లేని ప్రైవేట్ బిల్డింగ్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగి, విషపు కీటకాలు చేరుటకు అవకాశం ఉన్నందున సంబంధిత భవన యజమానికి వెంటనే ప్రాంగణము శుభ్రపరచుకొనవల్సిందిగా నోటీసు జారీ చేయవలసిందిగా పబ్లిక్ హెల్త్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఇటీవల కాలంలో నిర్మించిన రోడ్లు కృంగిపోయినట్లు గమనించిన కమిషనర్ సంబంధిత కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే గ్యాస్ గోడౌన్ వద్ద అసంపూర్తిగా ఉన్న సచివాలయ భవనమునకు సంబంధించిన నివేదికలు ఇవ్వవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం రామలింగాపురం వద్దనున్న అన్న క్యాంటీన్ ను కమిషనర్ సందర్శించారు. క్యాంటీన్ లో టోకెన్ విధానము, పారిశుద్ధ్య నిర్వహణపై నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘురాం, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రకాష్, సర్వేయర్ కామేశ్వరరావు, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్ల, సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.