
*డిజిటల్ హెల్త్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: వీఎస్‌యూ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు…*
నెల్లూరు: ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ హెల్త్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) వైస్–ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో, ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిఖ్ష అభియాన్ (PM-USHA) సహకారంతో “ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)”పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా ‘ఆభా’ (ABHA) అకౌంట్ ద్వారా వైద్య సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఏసిఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నోడల్ అధికారి డా. పి.వి. సుశీల్ కుమార్ మాట్లాడుతూ ఆభా అకౌంట్ ప్రయోజనాలు, నమోదు విధానం, డిజిటల్ ఆరోగ్య హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేయడం ద్వారా చికిత్స ప్రక్రియ వేగవంతం అవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆరోగ్య చరిత్రను వెంటనే యాక్సెస్ చేయడం ద్వారా ప్రాణరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని వివరించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్య సేవల డిజిటలైజేషన్‌పై అవగాహన పెంపొందించుకుని, ఈ విషయాన్ని తమ కుటుంబాలకు, సమాజానికి కూడా చేరవేయాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ మాట్లాడుతూ డిజిటల్ హెల్త్ సర్వీసెస్ వినియోగం భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. నేటి తరం విద్యార్థులు ఆరోగ్య సురక్షితతతో పాటు డిజిటల్ అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్. మధుమతి, డాక్టర్ బి.వి. సుబ్బారెడ్డి, సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.