*SPS నెల్లూరు జిల్లా*
*తేది:18-02-2025*

 

*”జిల్లా కలెక్టర్ కు కాకాణి లేఖ”*

*రెడ్ క్రాస్ విషయంలో పక్షపాత వైఖరితో కాకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారికి విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి*

 

*రెడ్ క్రాస్ లో రాజకీయ జోక్యం ఉండకూడదంటూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు నోటీసులు ఇవ్వడం, వారిని తొలగించడం, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సభ్యులపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ప్రశ్నిస్తూ, జిల్లా కలెక్టర్ గారి చర్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, జిల్లా కలెక్టర్ గారికి బహిరంగ లేఖ ద్వారా విన్నవించిన కాకాణి.*

శ్రీ ఓ. ఆనంద్ గారు, ఐ.ఏ.ఎస్.,

కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

మరియు అధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ వారికి,

ఆర్యా,

విషయము:- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ నందు సభ్యత్వం కలిగిన 5 మంది సభ్యులను ఇటీవలికాలంలో తొలగింపు కొత్త చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశము పూర్తి సభ్యుల సంఖ్య లేకుండానే జరుపుట అధికార పార్టీ ఒత్తిళ్ళతో ఏకపక్ష ధోరణితో నియమ నిబంధనల ఉల్లంఘన కొత్త చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక రద్దు కోరుట గురించి.

పై విషయమై మీకు తెలియజేయునది ఏమనగా, తేది: 08.01.2025న మీ అధ్యక్షతన జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నెల్లూరు జిల్లా శాఖ సమావేశము నందు సదరు సంస్థకు సంబందించిన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులలో సుమారు 7 మంది సభ్యులు వివిద రాజకీయ పార్టీల రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని వారిపై చర్యలు చేపట్టబడునని తమరు తెలియపరచియున్నారు.

తదుపరి 7 మంది సభ్యులలో వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు అన్న ఉద్దేశంతో కేవలం 5 మంది సభ్యులైన శ్రీ గంధం ప్రసన్నాంజనేయులు, శ్రీ దామిశెట్టి సుధీర్, శ్రీ

యం.వి.సుబ్బారెడ్డి, శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మరియు శ్రీ మలిరెడ్డి కోటారెడ్డి గార్లకు మాత్రమే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలియచేస్తూ వివరణ సమర్పించాలని తేదీ 11.01.2025న ఐదు మందికి తమరు నోటీసులు జారీ చేసియున్నారు. ఈ ఐదు మందికి మాత్రమే మీరు నోటీసు జారీ చేయుటలో కేవలం వై.ఎస్.ఆర్.సి.పి. కార్యకలాపాలలో పాల్గొను వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని జారీ చేయడం జరిగిందని అర్ధమవుతున్నది. ఎందుకనగా మీరు వ్యక్తం చేసిన మిగిలిన రాజకీయ పార్టీలతో సత్ససంబంధాలు కలిగిన మరో ఇద్దరని మాత్రం మీరు పరిగణలోకి తీసుకోనలేదు. ఇది Red Cross Society ప్రాథమిక సూత్రాలలో (7 fundamental principles) ఒకటి అయిన నిష్పాక్షికత కు విరుద్ధం. మీ ద్వారా సభ్యులకు జారీ చేయబడిన నోటీసు నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తేది:15.12.2017 నాటి నోటిఫికేషన్ లోని అధ్యాయం-|| నందలి ప్రాథమిక సూత్రాలలోని నిబంధన 3 నకు వారి ప్రవర్తన విరుద్ధముగా ఉన్నదని తెలిపియున్నారు. సదరు నిబంధనను పరిశీలించగా, రెడ్ క్రాస్ సంస్థ అందించు సేవలలో అందరి నమ్మకాన్ని పొందడానికి, శత్రుత్వాలతో ఏ పక్షానా ఉండకూడదు లేదా ఎప్పుడైనా రాజకీయ, జాతి, మత, లేదా సిద్ధాంత సంబంధిత వివాదాల్లో ఒక పక్షాన వహించకూడదు అని తెలిపి యున్నది. ఈ సందర్భములో నోటీసులు జారీ చేయబడిన వారు రెడ్ క్రాస్ సంస్థలో రాజకీయంగా ఎటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించలేదు. అలా చేసినట్టు లేక జరిగినట్టు మీ నోటీసు నందు కుడా పొందుపరచలేదు. మరియు ఈ విషయములో గమనించవలసిన ముఖ్యమైన అంశము ఏమనగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ కమిటీ నియమాలు -2017, తేది:15.12.2017 నాటి నోటిఫికేషన్ నందు పెడ్యూల్- 1 (నియమం-10), సభ్యత్వం మరియు నిధులులోని నిబంధన 2 ప్రకారం:

2. అర్హత: (1) వారి జాతీయత, జాతి, లింగం, మతం, విశ్వాసాలు, భాష, తరగతి లేదా రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా భారతదేశంలోని నివాసితులందరికీ సొసైటీ సభ్యత్వం తెరిచి ఉంటుంది.

3.సొసైటీ సభ్యత్వం విషయములో భారతదేశంలోని అందరు నివాసితులకు వారి జాతీయత, జాతి, లింగం, మతం, నమ్మకాలు, భాష, తరగతి లేదా రాజకీయ అభిప్రాయాలతో సంబంధం లేకుండా సభ్యత్వం కల్పించబడుతుంది అని స్పస్టముగా ఉన్నది.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) 1920లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చట్టం కింద స్థాపించబడింది, 1920 పార్లమెంట్ చట్టం XV కింద ఏకరీతి నియమాలు (Uniform Rules) చేర్చబడ్డాయి. ఈ నియమాలు దేశంలోని అన్ని రాష్ట్ర శాఖలు మరియు జిల్లా శాఖలకు ఒకే విధంగా వర్తిస్తాయి. మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యులుగా ఉండకూడదని నిర్దేశించే ప్రామాణిక నియమాలలో అలాంటి నిబంధన లేదు.

కావున రెడ్ క్రాస్ నందలి సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా కావచ్చు; అది రెడ్ క్రాస్ నియమ నిబంధనలకు విరుద్ధం కాదు. భారతదేశంలోని రాజకీయాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రెడ్ క్రాస్ జిల్లా శాఖలలో మరియు రాష్ట్ర శాఖలలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా మన గౌరవనీయ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (బిజెపి పార్టీ యం.పి.) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్ గా ఉన్నారు. మరియు మన రాష్ట్రములో శ్రీ సత్యసాయి జిల్లా, బి.జె.పి అధ్యక్షునిగా ఉన్నవారు ప్రస్తుతం ఆ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గా ఉన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లాల స్థాయిలో రాజకీయ పార్టీలతో సంబంధాలు మరియు పదవులు ఉన్నవారు వారి రెడ్ క్రాస్ సభ్యత్వాలను ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా కొనసాగుతూ వారి సేవలు సంస్థకు అందిస్తున్నారు, కాని మన జిల్లాలో మాత్రం పైన తెలిపిన 5 మంది సభ్యులు కేవలం YSRCP సానుభూతిపరులనే ఏకైక కారణంగా వారిని మీరు ప్రాధమిక సభ్యత్వం నుండి కూడా తొలగించడం జరిగినది. ఇది రెడ్ క్రాస్ నియమాలకు విరుద్ధము.

నోటీసులు స్వీకరించిన ఐదు మంది సభ్యులు వారి వివరణ సకాలంలో మీకు సమర్పించినప్పటికీ వారి వివరణను అమలులోవున్న నియమ నిబంధనల మేరకు

పరిగణించకుండా వారి ప్రాధమిక సభ్యత్వాల నుండి మరియు ఇతర పదవుల నుండి వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసినారు. మిగిలిన పార్టీలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న, మీ దృష్టిలో ఉన్న మరో ఇద్దరిని మాత్రం ఇప్పటికీ అలానే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాలో రాజకీయ పార్టీలకు చెందిన చాలా మంది ప్రజా ప్రతినిధులు ప్రాథమిక సభ్యులుగా కొనసాగుతున్నారు. నెల్లూరు Red Cross ప్రాథమిక సభ్యత్వం కలిగినవారిలో సుమారుగా 80% మంది రాజకీయ ప్రమేయం ఉన్న వారు ప్రాథమిక సభ్యులుగా కొనసాగుతున్నారు.

ఈ చర్య కారణంగా తొలగింపబడిన ఐ.ఆర్.సి.ఎస్ ఐదు మంది సభ్యులు వారి సభ్యత్వాల తొలగింపు విషయమై కలెక్టర్ గారి ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయం కోసం గౌరవ హైకోర్ట్ లో కొనసాగుతుంది.

ఈ చర్య కారణంగా తొలగింపబడిన ఐ.ఆర్.సి.ఎస్ ఐదు మంది సభ్యులు వారి సభ్యత్వాల తొలగింపు విషయమై కలెక్టర్ గారి ఆదేశాలను సవాల్ చేస్తూ న్యాయం కోసం గౌరవ హైకోర్ట్ ను ఆశ్రయించగా, తేది 23.01.2025న గౌరవ హైకోర్ట్ వారు కలెక్టర్ గారు సభ్యులను తొలగిస్తూ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధిస్తూ, సభ్యులను వారి పదవుల్లో కొనసాగించాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజునే అనగా తేది 23.01.2025న పదిహేను మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు గల ఐ.ఆర్.సి.ఎస్ నందు ఐదుగురు సభ్యులు లేకుండానే కేవలం పది మంది సభ్యులతో ఐ.ఆర్.సి. ఎస్ నెల్లూరు యూనిట్కు ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ గా శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారిని మరియు ఖాళీగా లేని వైస్ చైర్మెన్ పదవికి సైతం వైస్ చైర్మన్ గా శ్రీ చామర్తి జనార్ధన్ రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసియున్నారు.

ఈ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక విషయములో తమ దృష్టికి తీసురానున్నది ఏమనగా, ఐదు మంది సభ్యులును వారి పదవుల్లో కొనసాగించాలని గౌరవ హైకోర్ట్ ఆదేశాలు ఉన్నప్పటికీ, పదిహేను మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు గల ఐ.ఆర్.సి.ఎస్ నందు ఐదుగురు సభ్యులు లేకుండానే చైర్మన్ ఎన్నిక జరపడం అభ్యంతరకరమైన విషయము. మరియు వైస్ చైర్మన్ ఎన్నిక విషయములో అసలు వైస్ చైర్మన్ పదవి ఖాళీ లేదు, ఖాళీ లేని పదవికి ఎన్నిక నిర్వహించి మరొకరిని ఎలా ఎన్నుకుంటారు మరియు

మీరు జారీ చేసిన ఎన్నిక సమావేశము అజెండా నందు వైస్ చైర్మన్ ఎన్నిక విషయము కూడా లేదు సమావేశము నందు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయముగా కనబడుతుంది.

కావున అధికార రాజకీయ పార్టీ ఒత్తిళ్ళ కారణంగానో లేక ఇతర ఏకపక్ష ధోరణి కారణాలతో జరిపిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక రద్దు పరచి, తిరిగి పదిహేను మంది మేనేజింగ్ కమిటీ సభ్యులకు అజెండాలు జారీచేసి పారదర్శకంగా, నిష్పాక్షికంగా తిరిగి ఎన్నిక నిర్వహించ వలసినదిగా కోరడమైనది. ఈ విధంగా ఎన్నిక నిర్వహించకపోతే గతంలో జరిగిన ఎన్నికపై గౌరవ న్యాయస్థానాలలో వాజ్యాలు దాఖలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఒక ఏకపక్ష నిర్ణయం కారణంగా జరిగిన తప్పును గౌరవ న్యాయస్థానం వారు న్యాయపరమైన తీర్పు జారీ చేసియున్నారు. ఈ చర్యల వల్ల ప్రజల బాధలను తగ్గించడానికి మరియు నివారించడానికి మరియు శాంతి కోసం అన్ని రకాల మానవతా కార్యకలాపాలను ప్రేరేపించడం, ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన ఇండియన్ రెడ్ క్రాస్ సేవా సంస్థ ప్రతిష్ట మసకబారుతుంది.

మీ చర్యలు రాజకీయ పార్టీ ఒత్తిళ్ళ కారణంగా జరుగుతున్నాయన్న ఆరోపణను స్పష్టమైన ఆధారాలతో చేయగలగుతున్నాము, ఈ విషయములో ఐదు మంది సభ్యులు రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారనే కారణంతో మీరు తొలగించి ఇప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబందించిన వ్యక్తిని ఏవిధంగా ఏకంగా చైర్మన్ గా ఎన్నుకున్నారో తెలియడంలేదు. శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికలలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి అయిన శ్రీ పొంగూరు నారాయణ గారి తరపున వారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్న ఎన్నో సంఘటనలు సోషల్ మీడియా లో ఆధారాలతో ఉన్నాయి. శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ పొంగూరు నారాయణ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగముగా పలు ఆత్మీయ సమావేశములు వారు స్వయముగా నిర్వహించియున్నారు. తనకున్న అనుభవంతో మరియు సంబంధాలతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా ప్రధార కార్యక్రమాలు నిర్వహించారు. మరియు తను ప్రచురణ కర్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసే విధంగా కరపత్రాలు ఆయన స్వంత ఫోన్ నెంబర్ తో సహా ప్రచురించి పంపిణీ చేసియున్నారు. ఇవన్ని ఆధారాలతో నేను తమ పరిశీలన కొరకు మరియు చర్యల కొరకు పొందుపరుస్తున్నాను. ఇన్ని రాజకీయ వ్యవహారాలు నడిపిన వ్యక్తి ఏ విధంగా రాజకీయేతరుడో అర్ధంకావడం లేదు.

కావున ఈ విషయములో తమను కోరునది ఏమనగా, రెడ్ క్రాస్ నందలి సభ్యులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా కావచ్చు, అది రెడ్ క్రాస్ నియమ నిబంధనలకు విరుద్ధం కానందున, మీరు ఐదు మంది సభ్యత్వాలు రద్దుపరిచిన తరువాత కేవలం పది మంది సభ్యులతో నిర్వహించిన చైర్మన్ మరియు ఖాళీగా లేని వైస్ చైర్మన్ ఎన్నికను రద్దుపరచి తిరిగి పదిహేను మంది సభ్యులతో చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసినదిగా మరియు వైస్ చైర్మెన్ ఎన్నికను రద్దు చేయవలసినదిగా తమను కోరుతూ ఈ విషయములో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ సమర్పించడమైనది.

ధన్యవాదములు

భవదీయ

15/2/25

డా. కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు

జిల్లా పార్టీ అద్యక్షులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed