జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయండి
– విక్రమ సింహపురి యూనివర్సిటిలో మౌలిక సదుపాయాల కొరత.
– ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఉపయోగం
– శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
– సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్
– నూతన కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడి
గత ప్రభుత్వ అనాలోచితంగా తీసుకొచ్చిన GO-42 కారణంగా నెల్లూరు జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయని కోవూరు శ్రీ మతి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. బుధవారం ఆమె శాసనసభలో జిల్లాలోని పలు విద్యా సంబంధ సమస్యలను ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల మాత్రమే ఉందని, పురుషుల డిగ్రీ కళాశాల లేకపోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలల్లో చదవడం పేద విద్యార్థులకు భారంగా మారిందన్నారు. చాలా డిగ్రీ కళాశాలలో హిస్టరీ, ఎకనామిక్, కామర్స్ లాంటి ఆర్ట్స్ విభాగాలు లేకపోవడంతో గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సమస్యగా ఉందని ఆమె సభ దృష్టికి తెచ్చారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదని, విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలకు అనుమతులు వచ్చినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏర్పాటు కాలేదన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఆమె విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గారిని కోరారు. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాలలో ఖాళీలను భర్తీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించే విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అభ్యర్ధించారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తులకు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు సమాధానమిచ్చారు. త్వరలోనే ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు చేసి సంస్కరణలు తీసుకొస్తామన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలలను ఇండస్ట్రీలలో అనుసంధానం చేసి కొత్త కళాశాలల ఏర్పాటుతో పాటు అడ్మిషన్లు పెంచే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు సైతం ఎయిడెడ్ కళాశాల నుంచే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎయిడెడ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను చేస్తామని హామీ ఇచ్చారు.