నెల్లూరు, ఏప్రిల్ 1:
జిల్లాలో గర్భస్త లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్ ఆపరేషన్స్ (ఆకస్మిక తనిఖీలు) ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టరు వారి ఛాంబర్‌లో గర్భస్త పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం (పిసి పిఎన్‌డిటి) అమలుపై జిల్లాస్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్త శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుందన్నారు. లింగనిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు, నిర్వాహకులపై కఠిన తీసుకునేందుకు జిల్లాలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ మరింత ముమ్మరంగా నిర్వహించాలన్నారు.
స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమంటే భ్రూణ హత్యలను ప్రోత్సహించడమేనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కమిటీ సభ్యులు, ఎన్‌జివోలు లింగ నిర్థారణ పరీక్షలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 50 డెకాయ్ ఆపరేషన్లు చేపట్టామని, స్కానింగ్ కేంద్రాలు, వైద్యశాలల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుజాత కలెక్టర్‌కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, మహిళా పోలీసుస్టేషన్ డిఎస్‌పి రామారావు, డెమో కనకరత్నం, ఎన్‌జివో కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..
జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి, నెల్లూరు వారిచే జారీ.