జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం
-ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్
-హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు
-మొత్తం 3000 మందికి పైగా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కళకళలాడనున్న వర్శిటీ ప్రాంగణం
-ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు
-వివరాలు వెల్లడించిన ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత
———————–
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 30 నుండి మే 3వ తేది వరకు జరగనున్న అఖిల భారత అంతర యూనివర్శిటీ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ వివరాలను తెలియపరుస్తూ యూనివర్శిటీ ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత వర్శిటీ అధికారులతో కలిసి యూనివర్శిటీలోని శ్రీపొట్టిశ్రీరాములు భవనంలోని సెమినార్ హాల్ లో మీడియా ప్రతినిథుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గారు మాట్లాడుతూ విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారి ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్శిటీకి ఇన్ ఛార్జ్ వైస్-ఛాన్సలర్ గా అక్కడ ఒక ముఖ్య సమావేశంలో వైస్-ఛాన్సలర్ గారు ఉన్నారని తెలిపారు. ఆయన అధ్యక్షతన ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు కాకుటూరులోని మన యూనివర్శిటీ ప్రాంగణంలో అఖిల భారత అంతర యూనివర్శిటీ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ఘనంగా జరగనుందని వివరించారు. ఏప్రిల్ 30 నుండి మే 3వ తేది వరకు మహిళల టోర్నమెంట్, మే 4 నుండి మే 8వ తేది వరకు పురుషుల టోర్నమెంట్ జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం 6.30 గంటల నుండే మ్యాచ్ లు ప్రారంభం అవుతాయని, ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభ వేడుక జరగనుందని, ఆ వేడుకకు సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ముఖ్య అథితులుగా హాజరవుతారని, అదేవిధంగా మహిళల టోర్నమెంట్ ముగింపు వేడుక మే 3వ తేది సాయంత్రం 5 గంటలకు జరగనుందని, ఆ వేడుకకు సర్వేపల్లి ఎమ్మెల్యే శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ ఆచార్య వి.ఉమ గారు ముఖ్య అథితులుగా హాజరవుతారని తెలిపారు. మే 4వ తేదీన జరిగే పురుషుల టోర్నమెంట్ ప్రారంభ వేడుకలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారితో పాటు జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా టోర్నమెంట్ వివిధ దశల్లో జిల్లాకు చెందిన లోక్ సభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు గారు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు గారు, వివిధ ప్రజాప్రతినిథులు పాల్గొంటారని తెలిపారు. ఈ జాతీయ టోర్నమెంట్ లో మొత్తం 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు పోటీల్లో పాల్గొననున్నారని, ఒక్కో టీమ్ లో 16 మంది క్రీడాకారులు ఉంటారని, వారితో వచ్చే మేనేజర్, కోచ్ లు కలిపి మొత్తంగా 3000 మందికి పైగా క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. 40 మంది జాతీయ స్థాయి అంపైర్ లను, రెఫరీలను ఈ పోటీల కోసం రప్పించామని, వారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోటీలు నిర్వహిస్తామని అన్నారు. వర్శిటీ ప్రాంగణంలో 5 కోర్టులను ఏర్పాటు చేశామని, వాటిలో ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుండి సాయంత్రం వరకు సుమారు 35 మ్యాచ్ లను నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సహకారంతో ఏర్పాట్లు చేశామని అన్నారు. క్రీడాకారులందరూ వర్శిటీ ప్రాంగణానికి చేరుకుంటున్నారని వారి కోసం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఉన్నామని, అక్కడి నుండి రవాణా సదుపాయాన్ని కల్పించి వారిని వర్శిటీ ప్రాంగణానికి తీసుకుని వస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు వసతి సదుపాయాన్ని యూనివర్శిటీలోని హాస్టల్ గదులలో ఏర్పాటు చేసి ఉన్నామని, పలు తరగతి గదులను కూడా వసతి సౌకర్యార్థం ఏర్పాటు చేశామని తెలిపారు. టీమ్ మేనేజర్, కోచ్ లు, అదనపు సిబ్బంది కోసం దాతల సహాయంతో పలు కళాశాలల్లోని హాస్టల్ వసతిని ఏర్పాటు చేశామని, వారికి రవాణా సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. సిబ్బంది మొత్తానికి భోజన సౌకర్యాన్ని యూనివర్శిటీ కల్పిస్తోందని, క్రీడాకారుల కోసం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యూనివర్శిటీలో త్రాగు నీటికి, వాడుక నీటికి ఇబ్బంది లేకుండా జిల్లా అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు చేశామని, నిరంతరం విద్యుత్తుకు ఆటంకం కలుగకుండా విద్యుత్ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపాం అని అన్నారు. క్రీడాకారుల భద్రతకు పోలీసు శాఖ వారు పూర్తిగా సహకరిస్తున్నారని, ఈ అంశాల్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ టోర్నమంట్ విజయవంతం అయితే జాతీయ స్థాయిలో యూనివర్శిటీ ర్యాంకింగ్ మెరుగుపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతిఒక్కరు అందుకు తమవంతుగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీ.హెచ్.విజయ, పీఆర్వో డాక్టర్ కె.నీలమణికంఠ, టోర్నమెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎ.ప్రవీణ్ కుమార్, మణికంఠ పాల్గొన్నారు.