జగన్ ఫేడ్ అవుట్: చంద్రబాబు పుణ్యాన రాజకీయాల్లోకి- టీటీడీని వెనకేసుకొచ్చిన జేసీ
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ప్రకంపనలు తగ్గట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శల ముప్పేట దాడి కొనసాగుతూనే ఉంది.
తిరుపతి బైరాగిపట్టెడ పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం ఇది.
ఈ ఘటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటల దాడిని సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆర్ కే రోజా, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా పలువురు నాయకులు చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
దీనితో టీడీపీ సైతం ఎదురుదాడికి దిగింది. ఇదివరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నోరు విప్పారు. ఇప్పుడు తాజాగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెరపైకి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రోజా, ఇతర వైసీపీ నేతలపై విమర్శనాస్రాలను సంధించారు.
జగన్ శర రాజకీయాలు చేస్తోన్నాడంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నాడంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని చెలాయించినప్పుడు రోడ్డు పక్కన పరదాలు కట్టుకుని తిరిగేవాడని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.
జగన్‌ను జనం ఎవరూ పట్టించుకోవట్లేదని, ఆయన ఫేడ్ అవుట్ అయ్యాడని ఎద్దేవా చేశారు ప్రభాకర్ రెడ్డి. తిరిగి ప్రజల్లో ఆదరణ పొందడానికి శవ రాజకీయం చేస్తోన్నాడని జేసీ విమర్శించారు. జగన్‌కు సొంత పార్టీలోనే శతృత్వం ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గోదావరిలో బోటు ప్రమాదం జరిగి 39 మంది చనిపోతే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం సంఘటన స్థలానికి కూడా వెళ్లలేదని చెప్పారు. టీటీడీ టోకెన్లను అమ్ముకుని రోజా బెంజ్ కారును కొన్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
తిరుమలకు దర్శనానికి పోయినప్పుడల్లా వందమందిని వెంటేసుకుని వెళ్లారని విమర్శించారు. టోకెన్ల వ్యవహారంలో రోజా అనేక వివాదాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. టీటీడీ టోకెన్లు, చెక్ బౌన్స్ కేసుల్లో రోజా కథ చాలా ఉందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యాన రోజా రాజకీయాల్లోకి వచ్చారని జేసీ చెప్పారు. నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
(జన హుషార్ న్యూస్)