
*గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ బలోపేతం పురోగతి ఏమిటి? – రాజ్యసభలో శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్*
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2, 2026:
గ్రామీణ మరియు దూర ప్రాంతాల్లో మొబైల్ టవర్ల స్థాపన, టెలికాం కనెక్టివిటీ మెరుగుదల కోసం కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన మరియు ఆశావహ జిల్లాల్లో 4G కనెక్టివిటీ విస్తరణ పురోగతి ఎంత? అలాగే అత్యవసర పరిస్థితుల్లో నిరంతర కమ్యూనికేషన్ కోసం తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు రాజ్యసభలో ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సమాధానం ఇస్తూ, దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మొబైల్ టవర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021లో 23,436 టవర్లు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి 30,523 టవర్లకు పెరిగినట్లు అనుబంధ పట్టికలో వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 4G కనెక్టివిటీ విస్తరణ కోసం డిజిటల్ భారత్ నిధి (DBN) ద్వారా పలు ప్రాజెక్టులు అమలవుతున్నట్లు కేంద్రం తెలిపింది. 7287 ఆశావహ గ్రామాల ప్రాజెక్ట్ కింద 1,019 గ్రామాలను లక్ష్యంగా పెట్టుకోగా, 913 గ్రామాల్లో ఇప్పటికే 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 4G సాచ్యురేషన్ ప్రాజెక్ట్ కింద 2,596 గ్రామాలలో 2,289 గ్రామాలకు కనెక్టివిటీ అందించినట్లు వెల్లడించారు
భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అందిస్తూ హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 13,487 గ్రామపంచాయతీలలో 12,955కు సేవలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు
అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక SOP అమలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో Priority Call Routing (PCR), Intra-Circle Roaming (ICR), Cell on Wheels (COWs), అత్యవసర ఆప్టికల్ ఫైబర్ మరమ్మతు బృందాలు వంటి చర్యలు ఉన్నాయి.
గత ఐదేళ్లలో గ్రామీణ టెలికాం మౌలిక వసతుల విస్తరణ కోసం డిజిటల్ భారత్ నిధి కింద మొత్తం ₹12,122.73 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది
ఈ సందర్భంగా శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మొబైల్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అభివృద్ధి ద్వారా డిజిటల్ సేవలు, విద్య, ఆరోగ్యం మరియు ఉపాధి అవకాశాలు విస్తరించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీ వేగంగా విస్తరించేలా మరింత చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
—*శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారి కార్యాలయం, నెల్లూరు*