*గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం*
– గత ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది
– గ్రామపంచాయతీ నిధులను కూడా పక్కదారి పట్టించింది
– గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నాం
– గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతానికి కృషి
– సూపర్ సిక్స్ హామీల లక్ష్యంగా అడుగులు
– మార్చి, ఏప్రిల్ నెలల్లో తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఆర్థిక సాయం
– రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఆత్మకూరు, జనవరి 11 : గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం ఏ ఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామంలో రూ. 4.80 లక్షలతో నిర్మించిన రెండు క్యాటిల్ షెడ్స్ ను, 8 లక్షలు తో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి హోదాలో జమ్మవరం గ్రామానికి విచ్చేసిన ఆనంకు ప్రతి గడపలోనూ గ్రామస్థులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించి గ్రామాల్లో ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 10 కోట్లతో సిమెంట్ రోడ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నెలలో మరో 10 కోట్ల నాబార్డ్ నిధులను కూడా గ్రామాల్లో తారు రోడ్డు నిర్మించేందుకు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు చెప్పారు. గ్రామాల్లో పశుసంపదను పెంచేందుకు ఉపాధి హామీ నిధులతో క్యాటిల్ షెడ్స్ చెప్పారు. జమ్మవరం గ్రామంలో రామాలయం అభివృద్ధికి 80 లక్షలు, కాకర్లపాడు లో మాతమ్మ ఆలయ అభివృద్ధికి 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి వెళ్లిపోయినప్పటికీ ఎక్కడా కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా ఉద్యోగులకు జీతాలు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచి అందిస్తున్నట్లు చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఆర్థిక సాయం పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్ లకు పెద్ద ఎత్తు నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, స్థలాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యారమ, డ్వామా పిడి గంగాభవాని, పశుసంవర్ధక శాఖ జెడి రమేష్ నాయక్, పంచాయతీరాజ్ ఎస్ ఈ అశోక్ కుమార్, డి ఈ ఏడుకొండలు, సర్పంచ్ దొరసానమ్మ, ఎంపీటీసీ సుశీల, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
………………….
DIPRO, NELLORE